హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ వేసిన ఎర వ్యవహారంలో తెలంగాణ పోలీసుల పాత్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో క్యాషాయ గ్యాంగ్ గుట్టు రట్టయ్యింది. నిందితుల రిమాండ్‌కు మూడురోజుల క్రితం ఏసీబీ కోర్టు నిరాకరించడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే సైబరాబాద్ పోలీసులు వెంటనే తేరుకొని హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో పోలీసులు మొదటినుంచి ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. నిందితుల్లో ఒకడైన నందకుమార్‌పై రోజుల తరబడి నిఘా పెట్టారు. ముఖ్యంగా ఫాంహౌస్‌లోకి ఇద్దరు స్వామీజీలు, నందకుమార్ వస్తున్న రోజు పోలీసులు భారీ స్కెచ్ వేశారు. నాలుగు కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లలను అమర్చారు. ఎమ్మెల్యేలు ఎక్కడ, ఎలా కూర్చోవాలి? ఇలా పక్కాగా ప్లాన్ చేశారు. దీంతో ఆడియో, వీడియోల రూపంలో పక్కా ఆధారాలు లభించాయి. నిందితులను రిమాండ్‌కు ఏసీబీ మేజిస్ట్రేట్ తిరస్కరించడంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితులను పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించడంతో ఊరట చెందారు.