SLBC | అచ్చంపేట, ఫిబ్రవరి 24: ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేస్తున్న కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. తోటి కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోవడంతో అక్కడంతా విషాదవాతావరణం నెలకొంది. దోమలపెంట వద్ద కార్మికుల దయనీయ పరిస్థితిని తెలుసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ప్రయత్నించినా షాక్లో ఉండడం వల్ల వాళ్లెవరితోనూ మాట్లాడలేకపోతున్నారు. అక్కడ జేపీ, రాబిడ్స్ కంపెనీ కార్మికులు ఉన్నారు. కానీ వారి యోగక్షేమాల గురించి మాటామాటా కలుపగా గుండెగోడును వెళ్లబోసుకున్నారు. మూడ్నెళ్లుగా జీతాల్లేవు.. మావాళ్లకు ఫోన్లు చేసి పైసలు తెప్పించుకుని, సరుకులు కొనుక్కుంటున్నాం. మాకు రావాల్సిన డబ్బులిస్తే మా ఊళ్లకు వెళ్లిపోతాం అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. టన్నెల్ సమీపంలో ఒక షెడ్డులో మొత్తం 150 మంది ఉంటున్నట్టు తెలిపారు. తమ సమస్యలు పట్టించుకునేవారు లేరని కన్నీటి పర్యంతమయ్యారు. షిప్టులో 10 గంటలు పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. కష్టాలు భరిస్తూ ఉండలేక, ఉత్తచేతులతో వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
బాధలో ఉన్న మమ్మల్ని భయపెడ్తున్నరు
మేం మా బాధలో ఉంటే కంపెనీ అధికారులు, మేనేజర్లు వచ్చి పనికి రావాలని లోపలున్న మట్టిని తీయాలని, బెదిరిస్తున్నరు. లోపల ఉన్న పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ వంటి సహాయ బృందాలకే చాలా కష్టంగా ఉంది. మా వల్ల ఏమవుతుంది? మేం బతుకు దెరువు కోసం కుటుంబాలను వదిలేసి వచ్చాం. మేం లోపలికి వెళ్లి మా ప్రాణాలను పోగొట్టుకోలేం. – నిర్మల్ సాహూ, కార్మికుడు
కండ్ల ముందే కూలింది
ఆ రోజు 50 మంది కార్మికులం లోపలికి వెళ్లాం. నేను మిషన్ వెనుకభాగంలో పనిచేస్తున్నాను. టన్నెల్ పైకప్పులోని రంధ్రాల నుంచి నీళ్లు కారుతున్నాయి. ఆ రంధ్రాలను మూసి వేసేపనిలో ఉన్నాను. నీళ్లు ఎక్కువగా వస్తున్నాయి. మట్టి ఊడిపడుతున్నది. కాసేపటికి భారీశబ్దంతో పైకప్పు కూలింది. అందరం భయంతో పరుగులు పెట్టి నీటి నుంచి బయటపడి, రైలుపై సొరంగం బయటకు వచ్చాం.
– సందీప్సాహూ, కార్మికుడు