హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్త ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) సమరశంఖం పూరించింది. సెప్టెంబర్ 2 నుంచి నిరసనలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. సమస్యల పరిష్కారానికి దశలవారీ ఉద్యమాలు చేపట్టాలని, సమ్మెలే శరణ్యమని పిలుపునిచ్చింది.
హైదరాబాద్‌లో జరుగుతున్న ఏఐఎస్జీఈఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశాలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఫెడరేషన్ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుభాశ్లాంబ, శ్రీకుమార్ మాట్లాడారు. ఉద్యోగుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలకు సమాఖ్య పిలుపునిచ్చారు.
10 ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి దశలవారీగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, ఐదేండ్లకోసారి పీఆర్సీ అమలుచేయాలని, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీచేయాలని, ఆదాయపు పన్ను పరిమితిని 10 లక్షలకు పెంచాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని, నల్లచట్లాలను రద్దుచేయాలని వారు డిమాండ్ చేశారు. సమావేశాల్లో టీఎన్జీవో కేంద్ర సంఘం అసొసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, కొండల్‌రెడ్డి, ఉమాదేవి, మాధవి, శైలజ తదితరులు పాల్గొన్నారు.
దశలవారీగా జేఏసీ ఉద్యమ కార్యాచరణ: మారం జగదీశ్వర్
తెలంగాణలోని ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడినట్టు టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఏఐఎస్జీఈఎఫ్ ముగింపు సమావేశంలో వెల్లడించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించనున్నట్టు తెలిపారు. వివిధ సమస్యలపై ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో దశల వారీగా కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.
విరుద్ధమైన చట్టాలను రద్దుచేయాలి: ఎస్ఎం హుస్సేని
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాల్లో ఉద్యోగుల హక్కులకు భంగం కలిగించే చట్టాలను రద్దుచేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని (ముజీబ్) ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రతినిధులు ఆమోదించారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమంలోని ఉద్యోగులు, కార్మికులు, రైతుల హక్కులకు విరుద్ధమైన సెక్షన్లను రద్దుచేయాలని ఆ తీర్మానంలో ఆయన కోరారు.