భువనగిరి అర్బన్, జనవరి 26 : భువనగిరి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అనిల్కుమారెడ్డి జాతీయ జెండా ఎగురవేసిన తీరు ఆందోళనకు దారితీసింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటం లేకుండా, జాతీయ పతాకాన్ని సరైన విధంగా ఏర్పాటు చేయకుండా అగౌరవ పర్చారని బీఆర్ఎస్, బీజేపీతోపాటు దళిత సంఘాల నాయకులు క్యాంపు కార్యాలయం ఎదుట ఆదివారం ధర్నా చేశారు. అంబేద్కర్ను, జాతీయ పతాకాన్ని అగౌరవపర్చిన ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, దళిత నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దళిత నాయకుడు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, మాజీ కౌన్సిలర్ రత్నపురం బలరాంతోపాటు పలువురిని అరెస్టు చేశారు. దళిత నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్స్టేషన్ ఎదుట పలువురు ధర్నా నిర్వహించారు.