హైదరాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ) : బకాయిలు చెల్లించకుంటే తమకు చావే శరణ్యమని చేపపిల్లల పంపిణీదారులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పురుగుల మందు డబ్బాలతో బుధవారం మత్స్యశాఖ కమిషనరేట్‌కు తరలివచ్చారు. అధికారులతో జరిగిన సమావేశంలోనే.. బకాయిలు చెల్లిస్తారా.. లేదంటే పురుగులమందు తాగి చావమంటారా? అని అధికారులను నిలదీశారు. నిర్మల్ జిల్లాకు చెందిన బోసి ఆనంద్, మంచిర్యాల జిల్లాకు చెందిన కందుల శ్రీను పురుగుల మందు తాగడానికి సిద్ధమయ్యారు. దీంతో అధికారులతో పాటు అక్కడున్న ఇతరులు వారిని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా సర్కారు తీరుపై పంపిణీదారులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తంచేశారు. తమను చావనివ్వరు.. బతకనివ్వరా? అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పులు ఇచ్చినవాళ్లు నిత్యం ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారని, ఆ అవమానం భరించేకన్నా.. చావడమే ఉత్తమమని వాపోయారు. ఏడాదిన్నరగా ఎంత వేడుకున్నా ఈ ప్రభుత్వం కనికరించడం లేదని మండిపడ్డారు. కమిషనరేట్‌కు వచ్చిన చేపపిల్లల పంపిణీదారులతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులపై పంపిణీదారులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
ఉచిత చేపపిల్లల పంపిణీలో భాగంగా చేపపిల్లల్ని సరఫరా చేసిన పంపిణీదారులకు బకాయిలు చెల్లించేందుకు కాంగ్రెస్ సర్కారు ససేమిరా అంటున్నది. 2023-24 సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.100 కోట్లు, గతేడాదికి సంబంధించి రూ.43 కోట్లు కలిపి మొత్తం రూ.143 కోట్ల వరకు ప్రభుత్వం పంపిణీదారులకు బకాయిపడింది. వీటికోసం ఏడాదిన్నరగా పంపిణీదారులు మొరపెట్టుకుంటున్నారు. అయినా ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు. చివరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. వెంటనే బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలకూ దిక్కులేకుండా పోయింది. దీంతో రెండేండ్లుగా బకాయిల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు పంపిణీదారులు వాపోతున్నారు. ఐనప్పటికీ ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి టెండర్లు వేయాలంటూ పంపిణీదారులను కోరడం గమనార్హం.