సిద్దిపేట, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సంగారెడ్డి (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మెదక్ జిల్లాల్లో 22-ఏ నిషేధిత జాబితా సమస్య పెద్దఎత్తున ఉన్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. అందుబాటులో ఉన్న ప్రాథమిక లెకల ప్రకారం సిద్దిపేట జిల్లాలో సుమారు 11 వేల ఎకరాలు, మెదక్ జిల్లాలో 6 వేల ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 25 వేల ఎకరాలకుపైగా భూములు 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్టు సమాచారం. ఈ మూడు జిల్లాల్లో కలిపి దాదాపు 40 వేల ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ పరంగా చికుల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. రెవెన్యూ అధికారులు గ్రామాలు, పట్టణాలవారీగా లెక్కలు తీస్తే ఇది మరింత ఎక్కువే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
అధికారిక లెక్కలు అడిగితే, రెవెన్యూ అధికారులు తప్పించుకుంటున్నారు. తమ వద్ద ఏమీలేదని, అంతా సీసీఎల్ నుంచి వస్తుందని దాటవేస్తున్నారు. వీటిని సరిచేయాలని తహసీల్దార్, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు కావడం లేదని బాధితులు వాపోతున్నారు. 22-ఏ జాబితాలో తమ భూమి ఎందుకు ఉన్నదో తెలియక, తొలగించుకొనే ప్రక్రియపై స్పష్టత లేక ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద నెలకొన్నది.
మెదక్ జిల్లాలో రీజినల్ రింగ్‌రోడ్ (ఆర్ఆర్ఆర్) పరిధిలో భూముల సేకరణ ప్రక్రియలో భాగంగా భూసేకరణ, 22-ఏ జాబితాలు, రిజిస్ట్రేషన్ల అంశాలు పరస్పరం ముడిపడి ఉండటంతో భూ యజమానుల్లో ఆందోళన నెలకొన్నది. నిషేధిత భూముల వివరాలను గ్రామం, మండలం, సర్వే నంబర్ స్థాయిలో అధికారికంగా పరిశీలించి, ఏ భూమి ఎందుకు నిషేధిత జాబితాలో ఉన్నదో ప్రభుత్వం స్పష్టంచేయాలని రైతులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లాలో పలు కీలక భూములు 22-ఏ క్యాటగిరీలో ఉన్నట్టు సమాచారం. రాజీవ్ రహదారి పకన ఉన్న సుమారు 484 ఎకరాల భూమి వివాదాస్పదంగా మారింది. బోగస్ ఎక్స్-సర్వీస్‌మెన్, ఫ్రీడమ్ ఫైటర్ పత్రాల ఆధారంగా బదలాయింపులు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ భూమి 22-ఏ(1)(ఈ) కింద ఉన్నట్టు చెప్తున్నారు.

22a
కూటిగల్‌లో ఎస్సీ, ఎస్టీల పట్టా భూములదీ అదే పరిస్థితి
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం కూటిగల్ గ్రామంలో భూభారతి రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22-ఏలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన పలువురు రైతుల పట్టా భూములు నమోదు కావడంతో గత కొన్నేండ్లుగా వారంతా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని 170/డీ సర్వే నంబర్లో సుమారు 159.37 ఎకరాల భూమి ఉండగా, ఇందులో 97.37 గుంటల సీలింగ్ భూమి ఉన్నది. గ్రామంలోని 170/డీ సర్వే నంబర్లో 40 మందికి చెందిన సుమారు 77 ఎకరాల భూములకు సంబంధించిన భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయినట్టు బాధిత రైతులు చెప్తున్నారు. అయితే 170/డీ సర్వే నంబర్లో 14 ఎకరాలు, 204 సర్వే నంబర్లోని 6 ఎకరాల 22 గుంటల పట్టా భూమిని పొరపాటున 22-ఏ జాబితాలో పొందుపరిచినట్టు అధికారులు అధికారికంగానే వెల్లడిస్తున్నారు. జిల్లాలోని పలు సర్వే నంబర్లలో గుంట నుంచి ఎకరం వరకు భూమిని 22-ఏ జాబితాలో చేర్చడం రైతులకు తలనొప్పిగా మారింది. తమకు చట్టబద్ధంగా ఉన్న భూమిలో కొంతభాగం నిషేధిత జాబితాలోకి ఎలా వెళ్లిందో తెలియక ఆందోళన
చెందుతున్నారు. ఒకే సర్వే నంబర్లో కొంత భూమిని మాత్రమే 22-ఏలోకి చేర్చడానికి కారణమేమిటో పాత రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, పట్టాదారు వివరాలను పరిశీలించి అధికారులు స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అర్హత ఉన్న రైతుల భూములు పొరపాటున 22-ఏ జాబితాలో చేరి ఉంటే వెంటనే పరిశీలించి, నిబంధనల ప్రకారం వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సర్వే నంబర్‌నూ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యకు శాశ్వత పరిషారం చూపాలని కోరుతున్నారు.
నిషేధిత జాబితాలో 30 ఏండ్ల నాటి కాలనీలు
సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, పటాన్చెరు నియోజక వర్గాల్లోనూ నిషేధిత జాబితా తీవ్ర కలకలం సృష్టిస్తున్నది. 30 ఏండ్ల క్రితం ఏర్పడిన కాలనీలను సైతం నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు కలవరపడుతున్నారు. ఇందులో సామాన్యులే కాదు కాంగ్రెస్ నాయకుల ఆస్తులు కూడా ఉన్నాయి. వారు సైతం ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. సొంత సర్కార్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని కోట్లు విలువ చేసే వ్యవసాయేతర భూములు, ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో నమోదుచేశారు.
ముఖ్యంగా అమీన్పూర్ మండలంలోని 40 నుంచి 20 ఏండ్ల క్రితం ఏర్పాటైన కాలనీలు, వెంచర్లు, నివాస ప్రాంతాలు 22-ఏ జాబితాలో చేరాయి. అమీన్పూర్, బీరంగూడలోని సర్వే నంబర్లు 993/4, 993/46, 993/45, 993/49అ, 343, 594, 946, 662, 103/అ, 622/అ, 343/6-9లోని సుమారు 200 ఎకరాల భూముల్లో ఏర్పాటైన కాలనీలు, నివాస గృహాలను 22-ఏ జాబితాలో చేర్చారు. బీరంగూడలోని సర్వే నంబర్ 963/అలో 3.35 ఎకరాల్లో 40 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఇక్రిశాట్ కాలనీ ఫేజ్-2 నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయింది. ఇక్రిశాట్ ఫేజ్-2లో 200కుపైగా నివాస గృహాలు ఉంటాయి. అమీన్‌పూర్‌లోని మల్లికార్జున నగర్‌కాలనీ, గ్రీన్‌ఫీల్ట్, మోడీకాలనీ, మెడోస్, ప్రణీత్ కౌంటీ, సింఫనీ తదితర కాలనీలను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. అమీన్పూర్, బీరంగూడతోపాటు జిన్నారం, గుమ్మడిదల, రామచంద్రాపురంలోని వందలాది వ్యవసాయేతర భూములను నిషేధిత జాబితాలో నమోదు చేశారు.
గుమ్మడిదలలోని 261, 261/4 సర్వే నంబర్లోని 15 ఎకరాలు, అనంతారంలోని 173, 174 సర్వే నంబర్లలోని వంద ఎకరాలకుపైగా వ్యవసాయ భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి. కంది మండలంలో 200 ఎకరాలకుపైగా వ్యవసాయేతర భూమితోపాటు ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల పక్కన ఉన్న ప్రైవేట్ ఆస్తులు, వ్యవసాయేతర భూములను సైతం ప్రభుత్వం 22-ఏ జాబితాలో చేర్చింది. అమీన్పూర్లో గత ప్రభుత్వాలు స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు నిబంధనల మేరకు ఐదు నుంచి పది ఎకరాల చొప్పున భూములను కేటాయించింది. ప్రస్తుతం 10 మంది స్వాతంత్య్ర సమరయోధులు, 10 మంది మాజీ సైనికులకు కేటాయించిన భూములను రేవంత్ సర్కార్ 22-ఏ జాబితాలోకి చేర్చడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ నేతల భూములు సైతం..
పటాన్చెరు నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నాయకులకు చెందిన వ్యవసాయేతర భూములతోపాటు వారి సమీప బంధువుల భూములు సైతం 22-ఏ జాబితాలో చేరాయి. సొంత ప్రభుత్వమే తమ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంపై మండిపడుతున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేత బాబాయి నడుపుతున్న బార్ అండ్ రెస్టారెంట్, మరో వ్యాపార కేంద్రం ఉన్న నాలుగు ఎకరాల స్థలం, వెయ్యి గజాలకుపైగా స్థలం నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయింది. పటాన్‌చెరుకు చెందిన మరో కాంగ్రెస్ నేత రెండేండ్ల క్రితం బీరంగూడ, అమీన్పూర్లో పది ఎకరాల్లో వేసి వెంచర్లు సైతం ఆ జాబితాలోకే వెళ్లాయి. సదరు నేత సైతం ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు.
ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు
నాకు 170/డీ సర్వే నంబర్లో 3 ఎకరాల 20 గుంటల పట్టా భూమి ఉన్నది. ఈ భూమి పట్టా భూమిగా రికార్డుల్లో చూపించకపోవడంతో భూమిని మా అవసరాల కోసం అమ్ముకోలేకపోతున్నాం. మునుపటి లెక్కనే మా భూమిని పట్టా భూమిగా రికార్డుల్లో మార్చాలని ఎన్నిసార్లు ఆఫీసుల చుట్ట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. సర్వేయర్లు రెండు మూడుసార్లు వచ్చి సర్వే చేసుకొని వెళ్లినా రికార్డుల్లో మార్చడం లేదు. అధికారులు తక్షణమే స్పందించి మా భూములను మునుపటిలాగానే పట్టా భూములుగా రికార్డుల్లో నమోదు చేయాలి.
-ధరావత్ స్వామి, రైతు, రెడ్యానాయక్‌తండా, కూటిగల్, ధూళిమిట్ట మండలం (సిద్దిపేట జిల్లా)