హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): కులగణనతోనే సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీల సమగ్ర స్వరూపం అందుబాటులోకి వస్తుందని, తద్వారానే వెనకబడిన వర్గాల వికాసం సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో ఆదివారం అఖిల భారత ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్, అయ్యరక సంక్షేమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో బీసీ కులగణన ఆవశ్యకతపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.వెయ్యి కోట్ల లోపే కేటాయించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఓబీసీ పార్లమెంటరీ స్థాయీ సంఘం కుల గణన చేపట్టాలని సిఫారసు చేసినా కేంద్రం బుట్టదాఖలు చేసిందని ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు గల్లంతు అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పటికైనా కేంద్రం స్పందించి జనాభా గణనతోపాటు కుల గణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం కృష్ణమోహన్‌రావును వివిధ సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సదస్సులో అఖిల భారత అయ్యరక సంక్షేమ సంఘం, అఖిల భారత ఓబీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి పెదిరెడ్ల రాజశేఖర్‌తోపాటు బీసీ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.