హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఎంతో సంక్లిష్టమైన అవయవ మార్పిడులకు నిమ్స్ దవాఖాన కేంద్రంగా మారుతున్నది. వందల మందికి పునర్జన్మ ప్రసాదిస్తున్నది. తాజాగా మరో ముగ్గురికి విజయవంతంగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించింది. వీరు బుధవారం డిశ్చార్జి కానున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నిమ్స్ దవాఖానలో సర్జికల్ గ్య్రాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ హెడ్, నిమ్స్ కాలేజీ డీన్ డాక్టర్ బీరప్ప, కార్డియాలజీ ట్రాన్స్‌ప్లాంటేషన్ హెచ్‌వోడీ డాక్టర్ అమరేశ్ రావు, యూరాలజీ హెచ్‌వోడీ రాహుల్ దేవరాజ్, అనస్థీషియా హెచ్‌వోడీ డాక్టర్ నిర్మల మీడియాతో మాట్లాడారు. ఇటీవల బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారణ అయిన 45 ఏండ్ల మహిళ, 27 ఏండ్ల యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేయగా, వాటిని ముగ్గురికి అమర్చినట్టు వెల్లడించారు.
‘స్కిమాటిక్ కార్డియోమయోపతి’ వ్యాధితో బాధపడుతున్న 57 ఏండ్ల వ్యక్తికి గుండెమార్పిడి సర్జరీ చేశారు. డాక్టర్ అమరేశ్ రావు నేతృత్వంలోని కార్డియాక్ సర్జన్ల బృందం గంటలపాటు కష్టపడి, ఈ క్లిష్టమైన ఆపరేషన్ పూర్తి ఉచితంగా నిర్వహించినట్టు బీరప్ప వెల్లడించారు. ‘ఆటో ఇమ్యూన్ హెపటైటిస్’తో బాధపడుతున్న నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన 27 ఏండ్ల మహిళకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. డాక్టర్ బీరప్ప నేతృత్వంలో డాక్టర్ తుమ్మ వేణుమాధవ్, డాక్టర్ పద్మజ, డాక్టర్ ఇందిర, డాక్టర్ శిబానీ, డాక్టర్ నిర్మల, డాక్టర్ సుకన్య బృందం ఈ నెల 10న కాలేయ మార్పిడి సర్జరీ నిర్వహించారు. ఇబ్రహీంపట్నంకు చెందిన 42 ఏండ్ల వ్యక్తికి కిడ్నీ మార్పిడి చేశారు. డాక్టర్ రాంరెడ్డి, డాక్టర్ రాహుల్ దేవరాజ్, డాక్టర్ చరణ్, డాక్టర్ ధీరజ్ బృందం సర్జరీ విజయవంతంగా చేసింది.
నిమ్స్‌లో అత్యంత నిపుణులైన సర్జన్లు ఉండటం, మరోవైపు ప్రభుత్వం పూర్తి ఉచితంగా అవయవ మార్పిడులు చేయిస్తుండటంతో దేశంలో అవయవ మార్పిడుల కేంద్రంగా నిమ్స్ ఎదిగిందని డాక్టర్ బీరప్ప సంతోషం వ్యక్తం చేశారు. ఒక్కో అవయక మార్పిడికి ప్రైవేట్ దవాఖానల్లో రూ.30-40 లక్షల వరకు ఖర్చవుతుందని, ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిమ్స్‌లో ఇప్పటివరకు 24 లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు, 1,500 కిడ్నీ మార్పిడి చికిత్సలు చేశామని తెలిపారు.
2016 నుంచి నిమ్స్‌లో నాకు అన్ని రకాల పరీక్షలను ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేస్తున్నారు. ఇప్పుడు కాలేయ మార్పిడి సర్జరీ సైతం పైసా ఖర్చు కాకుండా జరిగింది. బయట దవాఖానల్లో రూ.30 లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సను ప్రభుత్వం ఉచితంగా చేయించింది. నిమ్స్ వైద్యులు ఆరేండ్లుగా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అవయవ మార్పిడి పూర్తయిన వారంలోనే కోలుకొని డిశ్చార్జీ అవుతున్నాను. సిబ్బంది పనితీరు చాలా బాగుంది. -ప్రణీత, కాలేయ మార్పిడి చేయించుకొన్న మహిళ