హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం వద్ద సహాయక చర్యలకు సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపడుతున్న చర్యలు ముందుకు సాగడం లేదు. లోపలి వైపు భారీగా నీరు చేరుతుండటంతో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. సహాయ బృందాలు లోపలికి వెళ్తూ ప్రమాదస్థలం వద్ద పరిస్థితులను చూసి వెనక్కి వస్తున్నారు. సహాయ చర్యలకు ప్రధానంగా సొరంగంలో భారీగా వస్తున్న ఊట నీరు, భారీగా పేరుకుపోయిన బురదనే అవరోధంగా నిలుస్తున్నదని ఆయా బృందాల సిబ్బంది పేర్కొంటున్నారు. భూమి ఉపరితలం నుంచి ప్రమాదం జరిగిన టన్నెల్ ప్రాంతానికి డ్రిల్ చేయడం కూడా అసాధ్యమేనంటున్నారు. ఈ నేపథ్యంలో సొరంగ మార్గం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని సహాయ బృందాలు, అధికారులు తేల్చేసినట్టు తెలుస్తున్నది.
ఇక సొరంగం పూర్తిగా పూడుకుపోగా లోపల చిక్కుకున్న కార్మికుల ఉనికిని తెలుసుకునేందుకు ర్యాట్ మైనర్లను పిలిపించారు. అయితే ఈ విధానం కూడా సరిగా పనిచేయని పరిస్థితులు అక్కడ ఉన్నాయని అంటున్నారు. భూమి గట్టిగా, నీటి ఊటలు లేని చోట మాత్రమే ర్యాట్ మైనర్లు సమర్థవంతంగా పనిచేస్తాయని తెలుస్తున్నది. నీటిఊట ఉన్న చోట ర్యాట్మైనర్లు ఎలాంటి రంధ్రాలను చేయలేకపోవడంతోపాటు, వెంట వెంటనే అందులో మట్టి జారిపోతున్నదని వివరిస్తున్నారు. దీంతో ర్యాట్మైనర్లు ఇక్కడ నిష్ప్రయోజమని తెలుపుతున్నారు. శిథిలాలను తొలగించడం ఒక ఎత్తయితే, వాటిని వెలుపలికి తరలించడం సవాలుగా ఉన్నదని సహాయ బృందాలు వివరిస్తున్నాయి. ఇలా అన్ని విధాలుగా ప్రతికూల పరిస్థితులే నెలకొన్నాయి. దీంతో సహాయ చర్యలు ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి వేస్తున్న పరిస్థితి నెలకొన్నది. మరోవైపు లోపల చిక్కుకున్న కార్మికుల స్థితిగతులపై అంతటా ఉత్కంఠ నెలకొన్నది.