కారేపల్లి, జనవరి 11: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చెందిన యూ ట్యూబర్ బానోత్ సాయినాథ్ అలియాస్ ఓకే సాయి తమను మోసం చేశాడంటూ ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన యువకులు ఆందోళన చేపట్టారు. బాధితులు అర్థాని శ్రీనివాస్, వనపర్తి దిలీప్, సూర్య, సయ్యద్, పవన్‌సాయి, అజయ్, మనోహర్, చంద్ర కథనం ప్రకారం.. యూట్యూబర్ ఓకే సా యి డిజిటల్ మార్కెటింగ్ (ఈజీ మనీ, ఏటీఎం) పేరుతో సులభంగా డబ్బు సంపాదించేలా శిక్షణ ఇచ్చేందుకు ఆన్లైన్ ద్వారా పరిచయమయ్యాడు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల చొప్పున 300 మంది వద్ద రూ.30 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత నెలలు గడుస్తున్నా అందుబాటులోకి రాలేదు.
దీంతో అతడి చిరునామా తెలుసుకున్న ఆంధ్రాకు చెందిన బాధితులు ఆదివారం కారేపల్లి వచ్చారు. యూట్యూబర్ ఓకే సాయి చేసిన మోసాలను ఫ్లెక్సీలుగా ముద్రించి వాటిని నిందితుడి ఇంటి ఎదుట, పోలీసుస్టేషన్ సమీపంలో ప్రదర్శించారు. ఈ మోసం గురించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు తీసుకునేందుకు నిరాకరించారు. ఈ విషయంపై పోలీసులను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. ఈ నేరం తమ పరిధిలోకి రాదని, ఆ బాధితులు స్థానికులు కాదని పేర్కొన్నారు.