హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి జరిగిన భూసేకరణతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఈ భూసేకరణ వల్ల 937 కుటుంబాలవారు నిరాశ్రయులయ్యారని, వారిలో ఐదుగురు పిటిషనర్లు సహా 927 కుటుంబాలకు వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద రూ.8 లక్షలు చొప్పున పరిహారం చెల్లించామని ఇటీవల కౌంటర్ దాఖలు చేసింది. మిగిలిన 10 మంది కూడా అంగీకరిస్తే పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. దీనిని పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం.. పరిహారం కోసం దాఖలైన వ్యాజ్యాలపై తదుపరి విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. కేసు విచారణను ముగిస్తున్నామని, ఇందుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని ప్రకటించింది.