హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులతోపాటు వాటి కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లింపులకు కూడా అధిక ప్రాధాన్యమిస్తున్నదని ప్రభుత్వ న్యాయవాది ముజీబ్ హైకోర్టుకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నరసింహసాగర్ (బస్వాపూర్) రిజర్వాయర్ నిర్మాణానికి సేకరించిన భూముల రైతులకు త్వరలో పరిహారం చెల్లిస్తామని తెలిపారు. ఏప్రిల్ నుంచే ప్రభుత్వం ఈ చెల్లింపులను ప్రారంభించిందని, జూన్ నెలాఖర్లోగా రూ.600 కోట్లు చెల్లించేందుకు ప్రణాళికలను రూపొందించిందని వివరించారు. పునరావాసం, పునర్నిర్మాణం కింద ఏప్రిల్లో రూ.197 కోట్లు, మేలో రూ.201.67 కోట్లు, జూన్లో రూ.200 కోట్లు చెల్లిస్తామని చెప్పారు. దీంతో సంతృప్తి చెందిన హైకోర్టు.. బస్వాపూర్ జలాశయ భూసేకరణకు సంబంధించిన వ్యాజ్యంపై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్ ముమ్మినేని సుధీర్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు.