హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రెండు శతాబ్దాల బ్రిటిష్ పాలన శృంఖలాలను తెంచుకుని, భారతదేశం స్వపరిపాలన సాధించుకొని 75 ఏండ్లు పూర్తైన సముజ్వల ఘట్టాన్ని పురస్కరించుకొని దేశమంతటా ఇటీవలే స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరిగాయి. సత్యాగ్రహ విధానంలో, అహింసా మార్గంలో సాగిన స్వాతంత్య్ర ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ, నాటి పోరాట విలువలను నేటి తరానికి పరిచయం చేసే ఉద్దేశంతో వీటిని నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఏడాదిపాటు సాగిన స్వాతంత్య్ర వజ్రోత్సవానికి ముగింపుగా కేంద్ర ప్రభుత్వం మూడు రోజులపాటు (ఆగస్టు 13, 14, 15) కార్యక్రమాలు నిర్వహించగా, తెలంగాణ ప్రభుత్వం ఏకంగా పదిహేను రోజుల పాటు (ఆగస్టు 8 నుంచి 22 దాకా) వైభవంగా వజ్రోత్సవాలు నిర్వహించింది. దేశంలో మరే రాష్ట్రం కూడా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఇన్ని రోజులపాటు, ఇంత ఘనంగా జరిపిన దాఖలాలు లేవు. 75 ఏండ్ల కిందట భారత్ ఎలా అహింసాయుత పోరాటంతో వలస పాలన నుంచి విముక్తి పొందిందో, అదే విధంగా 8 ఏండ్ల కిందట తెలంగాణ కూడా పూర్తి అహింసా మార్గంలో వలస పాలన నుంచి విముక్తి పొందింది. ఈ సాదృశ్యాన్ని ప్రస్ఫుటం చేస్తూ, లక్ష్య సాధనకు అహింసా మార్గమే అత్యున్నతమైనదనే సందేశాన్నిస్తూ, ఆ మార్గాన్ని ప్రతిపాదించి, ప్రబోధించి, ఫలితం సాధించి చూపెట్టిన మహాత్మాగాంధీ మార్గాన్ని నేటి తరానికి మరొక్కసారి పరిచయం చేసింది తెలంగాణ.
మహాత్ముడి ప్రబోధాన్ని భావి తరానికి అందించే సదుద్దేశంతో పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని సినిమా హాళ్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శింపజేస్తే దాదాపు 22.30 లక్షల మంది బాలలు దాన్ని వీక్షించి స్ఫూర్తి పొందారు. అదే విధంగా మహాత్ముడు ప్రబోధించిన స్వావలంబన సూత్రాన్ని ఆచరణలో పెడుతూ తెలంగాణ ప్రభుత్వం.. మువ్వన్నెల జెండాను ‘దిగుమతి’ చేసుకోకుండా, రాష్ట్రంలోనే.. 1.20 కోట్ల పతాకాలను తయారు చేయించి, ఉచితంగా ప్రజలకు పంచి, ప్రతి ఇంటిపై త్రివర్ణం రెపరెపలాడేలా చేసింది. తెలంగాణ వాసుల దేశభక్తిని ఆకాశాన్నంటేలా సగర్వంగా ప్రదర్శింపజేసింది. ప్రతి భారతీయుడి గుండె చప్పుడులాంటి జాతీయ గీతాన్ని, ఏకకాలంలో తెలంగాణవ్యాప్తంగా ఆలపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిస్తే, ఊరూవాడా ఏకమై, లక్షల మంది ఏకకాలంలో జనగణమన గీతాన్ని ఆలపించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపే మంత్రంగా ఎక్కడికక్కడ తాము చేస్తున్న ప్రయాణాలను కూడా నిలిపివేసి, మనఃపూర్వక దేశభక్తితో తెలంగాణ పౌరులు జాతీయ గీతాన్ని ఆలపిస్తే, జనగణమన ధ్వని ఊరూవాడా ప్రతిధ్వనించింది. ఇక ఉత్సవాల ఆరంభం, ముగింపు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పాల్గొనగా, చివరి రోజు ఎల్బీ స్టేడియం వేదికగా ఏర్పాటుచేసిన కార్యక్రమం, శంకర్‌మహదేవన్ తదితరుల సంగీత విభావరి దేశభక్తులను, సంగీత ప్రియులను ఆకట్టుకుని ఆలరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో, ప్రభుత్వ నిర్వహణలో పదిహేను రోజులపాటు, అపూర్వంగా జరిగిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణ ఘట్టం యావద్దేశ ప్రజానీకాన్నే కాదు; ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలనూ అబ్బురపరిచి నభూతో నభవిష్యతి అనిపించింది. దేశభక్తిలో తెలంగాణ పౌరులెవరికీ తీసిపోరు, తెలంగాణ పౌరులకు ఎవరూ సాటిరారన్న రీతిలో సాగిన స్వాతంత్య్ర వజ్రోత్సవం, ఇలాంటి మరికొన్ని కార్యక్రమాల కల్పనకు ఆలోచనలను ప్రోది చేస్తున్నది.
ఈ ఘనతనూ చాటాలె
ఒకప్పుడు ఆసియాలోనే సుసంపన్న దేశంగా ఉన్న హైదరాబాద్ స్టేట్, అప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా అవతరించిన నూతన భారత్‌లో భాగంగా మారిం ది. తెలంగాణ అంతర్భాగంగా ఉన్న హైదరాబాద్ స్టేట్ భారత్‌లో కలిసిన చరిత్రాత్మక ఘట్టం ఈ సెప్టెంబరు 17తో 74 ఏండ్లు పూర్తి చేసుకొని, 75వ ఏట అడుగుపెడుతున్నది. ఈ నేపథ్యంలో నాటి ఘన చరిత్రను, వర్తమాన వైభవాన్ని భావితరాలకు అందించడానికి ఉత్సవాలు నిర్వహించాలని, స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు కొనసాగింపుగా, తెలంగాణ ప్రాంతం భారత్‌లో కలిసిన సందర్భానికి కూడా ఘనంగా వేడుకలు నిర్వహించాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఏ జాతికైనా ప్రాంతానికైనా తనదైన వారసత్వం ఉంటుంది. చరిత్రను మలుపు తిప్పిన సందర్భాలుంటాయి. ప్రజలను ముందుకు నడిపించిన నాయకుడుంటాడు. తెలంగాణ పరిణామ క్రమంలో ఇవన్నీ చిరస్మరణీయాలే. ఈనాడు దేశంలో అభివృద్ధిలో ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా తెలంగాణ నిలబడేందుకు ఆనాడు భారతదేశంలో మనం భాగమైన ఘట్టమే కీలకం. ఆ ఘట్టాన్ని మనం మళ్లీమళ్లీ స్మరించుకొని స్ఫూర్తిని పొందాలి. ముందు తరాలకు ఆస్ఫూర్తిని అందించాలన్నదే ఆ ప్రతిపాదన సారాంశం.
మన కీర్తిని చాటేందుకు ఇదే సమయం
స్వతంత్ర భారత ప్రయాణాన్ని, 8 ఏండ్ల తెలంగాణ ప్రస్థానాన్ని దగ్గరగా గమనిస్తున్న వయోవృద్ధ మేధావులు కొందరు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఈ మేరకు ప్రతిపాదనను ఆయన ముందుంచినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకప్పటి హైదరాబాద్ స్టేట్‌లో కొన్ని ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రల్లో కలిసిపోగా, స్వతంత్ర అస్తిత్వంతో, ప్రత్యేక రాష్ట్రంగా అలరారుతున్న అతి పెద్ద భాగం తెలంగాణనే అనీ, అందువల్ల సుపంపన్న భారతంలో మనం కలిసి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా వజ్రోత్సవంలాంటి ఉత్సవం ఒకటి నిర్వహిస్తే బాగుంటుందని వారు ముఖ్యమంత్రికి సూచించినట్టు సమాచారం. ‘స్వాత్రంత్య్ర పోరాటం తరహాలోనే తెలంగాణ కూడా పూర్తిగా అహింసాయుతంగా రాష్ట్ర సాధన పోరాటం చేసింది. ఆనాడు జరిగినట్టుగానే తెలంగాణ విషయంలోనూ పూర్తి పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం రాష్ట్ర ఏర్పాటు చోటు చేసుకున్నది. అంతేకాకుండా 8 ఏండ్లలోనే తెలంగాణ ఒక రాష్ట్రంగా నిలదొక్కుకోవడమే కాదు, అభివృద్ధిలో దేశానికే నమూనాగా మారింది. ఉద్యమకారుడు, రాష్ట్ర సాధకుడు కేసీఆరే ముఖ్యమంత్రిగా పరిపాలన పగ్గాలు చేపట్టడంతో తెలంగాణ ఇప్పుడు దేశానికే వనరులు అందించే స్థాయికి చేరుకున్నది. ఒకప్పుడు వ్యవసాయ సంక్షోభంతో సతమతమైన ఈ ప్రాంతం ఇప్పుడు ఆహార సమృద్ధిని సాధించడమే కాదు; దేశానికే అన్నంపెట్టే స్థాయికి చేరుకున్నది. నిరంతర ఉచిత విద్యుత్తు, రైతు బీమా, రైతు బంధు, రైతు వేదికలు, ప్రాజెక్టుల నిర్మాణంతో సాగుకు రోల్ మాడల్‌గా మారింది. దేశాన్ని మించిన తలసరి ఆదాయం, పారిశ్రామిక అభివృద్ధి, నిరంతర విద్యుత్తు, శాంతి భద్రతలు, కుల మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు, ఆర్తులకు, అసహాయులకు అపన్న హస్తం.. ఇలా అనేక రంగాల్లో తెలంగాణ నేడు దేశాన్ని అబ్బుర పరుస్తున్నది. ఒకప్పుడు ప్రత్యేక దేశంగా సుసంపన్న హైదరాబాద్ స్టేట్ ప్రపంచంలోనే ఘనకీర్తి సాధించగా, వలస పాలన విషాద ఘట్టంతో తెలంగాణ గ్రహణ చంద్రుడిగా మారింది.

ఆ గ్రహణం 8 ఏండ్ల కింద ట విడిపోయింది. ఇప్పుడు తెలంగాణ మబ్బు వీడిన చంద్రుడు. ఒక ప్రాంతంగా తెలంగాణ ఇంత అభివృద్ధి సాధించడం ఎన్నడూ లేదు. ఏ రాష్ట్రమైనా 8 ఏండ్లలో ప్రగతి సూచికలను ఈ స్థాయిలో అధిగమించడం దేశ చరిత్రలోనే మొదటిసారి. అందువల్ల అపూర్వమైన మన గత చరిత్రను స్మరించుకోవడానికి, అందివచ్చిన మన ప్రగతి వారసత్వాన్ని వేడుక చేసుకోవటానికి తెలంగాణకు ఇంతకు మించిన మంచి తరుణం మరొకటి ఉండదు’ అని అనుభవజ్ఞులు ముఖ్యమంత్రితో సమావేశంలో ప్రతిపాదించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి సుదీర్ఘ చరిత్ర ఉన్నదో, తెలంగాణ పోరాట స్ఫూర్తి ఎంతటిదో మన పిల్లలకు చూపించడానికి, భారతదేశంలో కలిసి 75 ఏండ్లు అయిన సందర్భం అత్యుత్తమమైనదని వారు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన పట్ల కేసీఆర్ కూడా సానుకూలంగానే స్పందించినట్టు ఆయనకు సన్నిహితంగా ఉండే ముఖ్య నాయకుడొకరు చెప్పారు. ఆధునిక ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని మించిన పాలనా విధానం మరొకటి లేదని, ఉజ్వల పోరాటంతో విశాల దేశంగా ఆవిర్భవించిన ప్రజాస్వామ్య భారత్‌లో, తెలంగాణ అంతర్భాగం కావడం అపూర్వ ఘట్టమని సీఎం ఆ సందర్భంగా అభిప్రాయపడట్టు ఆయన వివరించారు. అహింసాయుత స్వతంత్ర పోరాటంతో భారత్ ప్రపంచానికి దారి చూపితే, అహింసాయుత అస్తిత్వ పోరాటంతో తెలంగాణ దేశంలోని ఇతర ప్రాంతాలకు దారి చూపిందనీ, పరిపాలనలో అభివృద్ధితో 8 ఏండ్లలోనే అనితర సాధ్యమైన ప్రగతి సాధించిందని, ఇదంతా కండ్ల ముందు కనిపిస్తున్న సత్యమని కూడా కేసీఆర్ వారికి వివరించారు. ఒకప్పుడు ఎట్లున్న తెలంగాణ ఇప్పుడెట్లుదన్నది ఆయన ప్రశ్నించగా, ఇదొక కలలా, కల్పనలా కనిపిస్తున్నదని వారు బదులిచ్చారు.
దేశమాత అడుగుజాడల్లోనే..
కాలప్రవాహంలో ఒక్కో శతాబ్దానిది ఒక్కో ముద్ర. ప్రపంచవ్యాప్తంగా వలసవాద, సామ్రాజ్యవాద, రాచరిక వ్యవస్థలు కుప్పకూలడం, సామ్యవాద, ప్రజాస్వామ్యవాద సైద్ధ్దాంతిక పునాది మీద భూగోళం మీద అనేక నూతన దేశాల ఉనికి ఏర్పడటం 19వ శతాబ్దపు ప్రత్యేక లక్షణం. ఆ పరిణామ క్రమంలోనే 75 ఏండ్ల క్రితం 1947లో భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై స్వపరిపాలనకు, ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికింది. ఈ పరిణామ ప్రభావం దేశమంతా పాకింది. దేశంలోని 500కు పైగా సంస్థానాలు తమ పూర్వ వ్యవస్థల నుంచి బయట పడ్డాయి. ఇదే క్రమంలో 1948 సెప్టెంబరు 17న, తెలంగాణ ప్రాంతం కూడా రాజరికం నుంచి ప్రజాస్వామ్య పాలనలోకి మారింది. అంతదాక ఒక సంస్థాన రాజ్యంగా ఉన్న హైదరాబాద్ సువిశాల భారత దేశ ప్రజాస్వామ్యంలో భాగమైంది. శతాబ్దాల ఎడబాటు అనంతరం ఈ భూభాగం తల్లి ఒడిలోకి చేరుకున్నది. యావత్ తెలంగాణ ప్రజలు భారతీయులై 75 ఏండ్లు అయిన సువర్ణ ఘట్టం ఇది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతా ఒకటే అనే ప్రజల చిరకాల వాంఛ సాదృశమైంది. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం కలిగిన భరతఖండపు కిరీటంలో హైదరాబాద్ మేలిమి వజ్రమై మెరిసింది. ఇదొక చారిత్రక పరిణామం. చెరిగిపోని సందర్భం. ప్రపంచంతో కలిసి నడిచి నవనాగరిక పాలనా వ్యవస్థను ఆలింగనం చేసుకున్న శుభ సందర్భం.
అనేక పోరాటాల ఫలితమే
సైద్ధాంతిక భావజాలాలకు అతీతంగా జాతి, కుల, మతాలకతీతంగా అనేకమంది చేసిన పోరాటాల ఫలితంగానే తెలంగాణ ప్రాంతం భారతదేశంలో కలిసిందని, అదే భావనను భావి తరాలకు కూడా పంచాల్సిన అవసరం ఉన్నదని కేసీఆర్ వారితో అన్నారు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో కలిసి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించాలనే దానిపై మంత్రివర్గ సహచరులతో చర్చిస్తానని ఆయన వారికి మాట ఇచ్చారు. వీటిని తెలంగాణ వజ్రోత్సవాలుగా నిర్వహించాలా, మరొక రకంగానా అన్నదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని సీఎం కేసీఆర్ వారికి చెప్పినట్టు తెలిసింది.