గోదావరిఖని, జనవరి 2 : సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ డివిజన్ ఇందారం ఖని ఓపెన్‌కాస్ట్ గనిలో జరిగిన పెనాల్టీ మాఫీ యత్నాలపై తీగ లాగితే డొంక కదులుతున్నది. ప్రైవేటు ఓబీ కాంట్రాక్టర్‌కు యాజమాన్యం విధించిన రూ.25 కోట్ల పెనాల్టీ మాఫీ చేయించుకునేందుకు కాంగ్రెస్ అండదండలతో ప్రయత్నాలు జరుగుతున్నాయని ‘నమస్తే తెలంగాణ’లో 2025 డిసెంబర్ 26న మెయిన్ పేజీలో వచ్చిన కథనంతో సింగరేణి యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిర్దేశిత ఓవర్ బర్డన్ (మట్టి తొలగింపు) పనులు సకాలంలో చేయని కారణంగా ఓబీ కాంట్రాక్టర్‌కు విధించిన పెనాల్టీ రూ.25 కోట్లను మాఫీ చేసేందుకు అధికార పార్టీ ముఖ్యనేత చక్రం తిప్పుతున్నారని కథనం రావడంతో సింగరేణి యాజమాన్యం ఉలిక్కిపడింది.
పెనాల్టీ మాఫీ చేసేందుకు కమిటీలు వేసి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్న క్రమంలో ఈ వ్యవహారం బట్టబయలు కావడంతో సింగరేణి యాజమాన్యం, ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టారు. పెనాల్టీ మాఫీ పథకంలో పెద్ద కుట్ర దాగి ఉందని, దానికి సంబంధించిన నివేదికను బయటపెట్టిన సింగరేణి సంస్థ విజిలెన్స్ అధికారిని బదిలీ చేశా రు. ఆయన స్థానంలో రామగుండం డివిజన్ -1కు చెందిన మరో అధికారి నియామకమయ్యారు.
‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం అనంతరం రామగుండం నుంచి బదిలీ అయిన అధికారిని తిరిగి అదే స్థానంలో పనిచేయాలని చెప్పడంతో ఆయన వెనుతిరిగి రామగుండంకు వచ్చి విధులు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. విజిలెన్స్ అధికారి బదిలీ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ సింగరేణికి చెందిన ఉన్నతాధికారి డైరెక్టర్(పా) నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయవర్గాలు పే ర్కొంటున్నాయి. బదిలీల విషయం లీక్ కావద్దని యాజమాన్యం ఆదేశించినట్టుగా తెలిసింది. సింగరేణి సంస్థలో రూ.25కోట్ల పెనాల్టీ మాఫీ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయినట్టుగా సమాచారం. సింగరేణి సంస్థలో అసలు ఏం జరుగుతున్నది?, తనకు ఎందుకు తెలియడం లేదని తన సంబంధీకులను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. పార్టీకి మచ్చ తెచ్చేలా జరుగుతున్న వ్యవహారాలకు చెక్ పెట్టాలని సీఎం యోచిస్తున్నట్టు తెలిసింది.