హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : జిల్లా స్థాయిలో డీఎఫ్ఆర్సీ.. స్టేట్ లెవల్లో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ.. ఇలా రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజుల ఖరారుకు త్వరలోనే రెండు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఈ కమిటీలు ఖరారుచేసిన ఫీజులనే పాఠశాలలు వసూలు చేయాలి. రాష్ట్రంలో 11,051 ప్రైవేట్ స్కూళ్లున్నాయి. కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ బడులు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇంజినీరింగ్ ఫీజుల కన్నా ఎల్కేజీ, యూకేజీ ఫీజులే అధికంగా ఉన్నాయి. దీంతో ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తెలంగాణ విద్యా కమిషన్ దృష్టిసారించింది. మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(ట్రస్మా) ప్రతినిధులతో ఫీజులపై సంప్రదింపులు జరిపింది. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ఫీజుల ఖరారుపై ట్రస్మా చీఫ్ అడ్వైజర్ యాదగిరి శేఖర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ యాదగిరి, ఐవీ రమణారావు, జయసింహాగౌడ్తో సంప్రదింపులు జరిపారు. మరో రెండు మూడు సమావేశాల అనంతరం నివేదికను రూపొందించి, ప్రభుత్వానికి సమర్పించే యోచనలో విద్యాకమిషన్ ఉంది.