హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): డిగ్రీ కోర్సుల సిలబస్ మార్పునకు సబ్జెక్టుల వారీగా త్వరలో విషయ నిపుణులతో కమిటీలు వేయాలని నిర్ణయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి వెల్లడించారు. డిగ్రీ కోర్సుల సిలబస్, ఇతర విధానాల మార్పు కోసం ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులు, వివిధ వర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి కొత్త సిలబస్‌ను ఖరారు చేయాలని ఆ దేశించారు. సమావేశంలో కమిటీ అధ్యక్షుడైన శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ మల్లేశ్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.