కామారెడ్డి : జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల ( Heavy rains ) వల్ల జిల్లా వ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టులు, చెక్ డ్యాములు పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారాయని, నీటి వనరుల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లరాదని కామారెడ్డి కలెక్టర్ (Kamareddy Collector ) ఆశిష్ సంగ్వాన్ (Ashish Sangwan) సూచించారు. అత్యవసరం అనుకుంటే తప్ప ఎట్టి పరిస్థితులలో ఈ భారీ వర్షాల సమయంలో ప్రయాణాలు చేయరాదని పేర్కొన్నారు.
ముఖ్యంగా వాగులు, నదులు, ఒర్రెల వద్ద బ్రిడ్జిలపై నుంచి ప్రయాణించేటప్పుడు నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతనే వెళ్లాలని తెలిపారు. ప్రభుత్వ అధికారుల ఆదేశాలను పాటించాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు, పాత భవనాలకు, పాటుపడ్డ ఇండ్లకు దూరంగా ఉండాలని సూచించారు. చేపల వేటకు వెళ్లరాదని, పొలాలకు, పశువులను మేపేందుకు వాగులు, ఒర్రెలు దాటి వెళ్లరాదని తెలిపారు.
జిల్లా ప్రజలను వరదల సమయంలో ఆదుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని, రాష్ట్రస్థాయి నుంచి ప్రత్యేక బృందాలు వస్తున్నాయని వివరించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా ఎలాంటి అత్యవసర పరిస్థితులున్నా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 08468-220069కు సమాచారం అందించాలని లేదా సమీప అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.
అధికారులు కూడా 24 గంటలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అండగా నిలవాలని అన్నారు. లో లెవెల్ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేసి పునరావాసం కల్పించాలని, లో లెవెల్ కాజ్వేలు, బ్రిడ్జ్ లో పైనుండి ప్రజలు ప్రయాణం చేయకుండా బారికెట్స్ ఏర్పాటు చేయాలని, ప్రమాదకరంగా ఉన్న నీటి వనరుల లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, వరదల సందర్భంగా ప్రజలను రక్షించేందుకు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు రాష్ట్ర స్థాయి నుంచి కూడా ప్రత్యేక బృందాలు జిల్లాకు వస్తున్నాయని తెలిపారు.