హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా మారింది… హైడ్రా దుందుడుగు వైఖరి. జలవనరులను కాపాడుతామంటూ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా.. పలు కాలనీలు జలమయమయ్యేందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం సాయంత్రం బేగంపేటలోని రసూల్‌పుర వద్ద పైగాకాలనీలోకి వరదనీరు పోటెత్తింది. 50 కుటుంబాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఓ కార్ల కంపెనీలోకి నీరు చేరడంతో.. ముప్పై మంది ఉద్యోగులు, సిబ్బంది వరదలో చిక్కుకున్నారు. సహాయ బృందాలు రంగంలోకి దిగి పడవల ద్వారా వారిని బయటకు తీసుకొచ్చాయి. వ్యాపార సముదాయాల్లో నీరు చేరుకోవడంతో.. జనం నిచ్చెనలతో బయటకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది. జూన్ 6న హైడ్రా చేపట్టిన కూల్చివేతల వల్లే ఇప్పుడు కాలనీలోకి నీరు చేరిందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నాలా పొంగినప్పుడు కాలనీలోకి వరద రాకుండా కాపాడే రిటైనింగ్ వాల్‌ను కూడా అక్రమ నిర్మాణం అంటూ హైడ్రా అధికారులు గుడ్డిగా కూల్చివేశారని తెలిపారు. తెల్లవారుజామున వచ్చి ఇష్టారాజ్యంగా గోడను పడగొట్టారని, తాము వద్దని వారించే అవకాశం కూడా లేకుండాపోయిందని గుర్తుచేశారు. సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా వరద నివాస ప్రాంతాల్లోకి రాకుండా తాత్కాలికంగా ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు.
కంటోన్మెంట్ సీఈవో ఘెరావ్
శనివారం ప్యాట్నీనగర్ నాలా పొంగడంతో పరిశీలించేందుకు వచ్చిన కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్‌ను ప్రజలు అడ్డుకున్నారు. హైడ్రా కూల్చివేతలకు కంటోన్మెంట్ బోర్డు కూడా సహకరించిందని మండిపడ్డారు. తమ అనుమతిలేకుండా, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా హైడ్రా ఈ రిటైనింగ్ వాల్ ఎలా కూలగొట్టిందని ప్రశ్నించారు. నాలాపై ఆక్రమణలు తొలగించి, తిరిగి రిటైనింగ్ వాల్ కట్టేందుకు హైడ్రా పనిచేస్తున్నదని, కొన్ని కుటుంబాలు కోర్టుకు వెళ్లడం వల్ల నిర్మాణాలు ఆగిపోయాయని మధుకర్ నాయక్ చెప్పారు.
హైడ్రా తీరు విడ్డూరం
పైగా కాలనీ మునిగిపోయి స్థానికులంతా వరదనీటిలో చిక్కుకున్నప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా బోట్లో వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఇక్కడ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి రిటైనింగ్ వాల్ కట్టలేకపోయామంటూ హైడ్రా అధికారులు చెప్పారు. హైడ్రా ఈ విషయం చెప్పడం విడ్డూరంగా ఉందని పైగా కాలనీ వాసులు మండిపడ్డారు. రెండురోజుల కిందటే హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు నోటీసులిచ్చిందని తెలిపారు. తాము ఇచ్చిన ఉత్తర్వులను ఎలా ఉల్లంఘిస్తారో వివరణ ఇవ్వాలని రంగనాథ్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారని చెప్పారు.
కూల్చివేతలే పరిష్కారం కాదు..
హైడ్రా కూల్చివేతలపై నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక అంశాలను పరిశీలించకుండా హడావుడిగా కూల్చివేతలు చేపడితే ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పట్టణ ప్రణాళిక విభాగ నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా నాలాల ఆక్రమణలు తొలగించే ముందు.. వాటి చుట్టుపక్కల ప్రాంతాలకు వరద రాకుండా అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయో పరిశీలించాలని సూచిస్తున్నారు. హైడ్రా మాత్రం సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టలేదని జీహెచ్ఎంసీ రిటైర్డ్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.