Army Degree College | హైదరాబాద్, జనవరి1 (నమస్తే తెలంగాణ): ఒక యూనివర్సిటీ పరిధిలోని కాలేజీని మరోచోటుకు తరలించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. కానీ సొసైటీ ఉన్నతాధికారులే ఆ నిబంధనను తుంగలో తొక్కి.. వర్సిటీకి సైతం సమాచారం ఇవ్వకుండా విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నపళంగా కాలేజీని తరలించడంపై సొసైటీ ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధి బీబీనగర్‌లోని ఆర్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ గురుకుల డిగ్రీ కాలేజీని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఘట్కేసర్ క్యాంపస్‌కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా, అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని, సొసైటీని పూర్తిగా భ్రష్టుపట్టిస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు.
కేసీఆర్ ఆధ్వర్యంలో కాలేజీ ఏర్పాటు
గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించడం.. సాయుధ దళాలకు మార్గదర్శకత్వం వహించేలా, ఉన్నత పౌరురాలిగా తీర్చిదిద్దాలనే ఉదాత్త లక్ష్యంతో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలో పలు ప్రత్యేక గురుకుల కాలేజీలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో 2018లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ (టీజీ ఎస్డబ్ల్యూఆర్ఏఎఫ్పీడీడబ్ల్యూ)ను ఏర్పాటు చేశారు. నాటి నుంచి సంస్థ సాయుధ దళాల కోసం బాలికలకు సమగ్రమైన, రక్షణకు సంబంధించిన అంశాలపై శిక్షణ అందిస్తున్నది. ప్రతీఏటా కళాశాలలో చేరిన 150 మంది మహిళా క్యాడెట్లకు ఆర్ట్స్, సైన్స్ లేదా కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీలను అందించడంతోపాటు అదే సమయంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) పరీక్షకు సైతం సిద్ధం చేస్తున్నది. కాలేజీలో విద్యను పూర్తిచేసుకున్న విద్యార్థినులు పోలీస్ ఫోర్సెస్‌తోపాటు, అనేక పరీక్షల్లో సత్తా చాటుతూ ముందుకుసాగుతున్నారు. అలాంటి కాలేజీని ఉన్నపళంగా రాత్రికి రాత్రే విద్యార్థినులతో సహా ఖాళీ చేయించారు.
విద్యార్థినుల భవిష్యత్తు ప్రశ్నార్థకం..?
బిల్డింగ్ యజమాని ఒత్తిడితోనే ప్రిపరేటరీ కాలేజీని షిఫ్ట్ చేశామని సొసైటీ అధికారులు చెబుతున్నా.. దీనివెనక పెద్ద కుట్ర దాగి ఉందని ఉద్యోగులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాలేజీ బిల్డింగ్ ఒప్పందం గడువు ముగియడంతో తిరిగి ఒప్పందం చేసుకోవాలని సదరు యజమాని ముందుగానే ప్రిన్సిపాల్‌కు నోటీస్ కూడా ఇచ్చారు. కానీ ఉద్దేశపూర్వకంగా ప్రిన్సిపాల్, సొసైటీ ఉన్నతాధికారులు ఒప్పందం చేసుకోలేదని ఉద్యోగులు వివరిస్తున్నారు. అదీగాక కళాశాల ప్రిన్సిపాల్ ఈసీఐఎల్ నుంచి నిత్యం బీబీనగర్‌కు రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే సొంత ప్రయోజనాల కోసం ఏకంగా కాలేజీనే ఘట్కేసర్కు షిఫ్ట్ చేయించారని, అందుకు సొసైటీలోని పలువురు ఉన్నతాధికారులు కూడా వత్తాసుపలికారని వెల్లడిస్తున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో గురుకులాన్ని తరలించడంపై విద్యార్థినులు మండిపడుతున్నారు. త్వరలోనే పరీక్షలు సమీపిస్తున్నాయని, తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ప్రిపరేటరీ కాలేజీని యథావిధిగా కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
మరో కాలేజీని తరలించేందుకు యత్నం..!
ఘట్కేసర్ పరిధిలోని అవుశాపూర్ క్యాంపస్‌లో ఇప్పటికే 3 మహిళా డిగ్రీ కాలేజీలను(బుద్వేల్, ఇబ్రహీపట్నం, మహేంద్రహిల్స్) నిర్వహిస్తున్నారు. అక్కడి క్యాంపస్‌లో వెయ్యి మందికి పైగా విద్యార్థినులు ఉన్నారు. ప్రస్తుతం బీబీనగర్ ప్రిపరేటరీ కాలేజీని సైతం అక్కడికి తరలించడంతో విద్యార్థినుల సంఖ్య మరో 400 పెరిగింది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థినులు పేర్కొంటున్నారు. అదీగాక ఆర్మీ కళాశాలకు ప్రత్యేకమైన వాతావరణం ఉండాలని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితే లేకుండా పోయిందని పోతున్నారు. ఆర్మీ ఎక్విప్మెంట్ తొలగించడంతో శిక్షణ ఆగిపోయిందని, విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు విద్యా సంవత్సరం మధ్యలో ఖాళీ చేయడంపై మండిపడుతన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు క్యాంపస్‌లో ఇబ్రహీంపట్నం కాలేజీని మరోచోటుకు తరలించేందుకు సొసైటీ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అయితే సొసైటీ ఉన్నతాధికారులు అనాలోచితంగా, ఇష్టారాజ్యంగా విద్యాసంవత్సరం మధ్యలో కాలేజీలను తరలించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు.