జనగామ చౌరస్తా , ఫిబ్రవరి 14: సమగ్ర ఇంటింటి కుటుంబ (Caste Survey) సర్వేను ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి నిర్వహిస్తున్నట్లు జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రకటన విడుదల చేశారు. ఇంతకుముందు నిర్వహించిన కుల గణన సర్వేలో పలు కారణాల చేత పాల్గొనలేక పోయినవారు ప్రజా పాలన సేవా కేంద్రాలు, టోల్ ఫ్రీ, ఆన్ లైన్ సెంటర్ల ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
కాంగ్రెస్ సర్కార్ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో బీసీల శాతం స్వల్పంగా తగ్గినట్లు నివేదిక స్పష్టం చేసింది. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తడంతో మరోసారి సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో నిర్వహించిన సర్వేలో పాల్గొనని వారి కోసమే ఈ సారి నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3.1 శాతం మంది సర్వేలో పాల్గొన లేదని, మరికొందరు ఉద్దేశపూర్వకంగానే వివరాలు వెల్లడించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించిన విషయం తెలిసిందే.