బయ్యారం, మార్చి 3: స్టీల్, సిమెంట్ రం గాల్లో పేరు గాంచిన ప్రముఖ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ (జిందాల్)కు చెందిన ఇద్దరు జియాలజిస్ట్‌లు, మహబూబాబాద్ జిల్లా మైనింగ్ శాఖ ఇన్చార్జి ఏడీ రవీందర్, టీఏ నరేశ్‌తో కూడిన ఆరుగురు సభ్యుల బృందం గురు, శుక్రవారాల్లో బ య్యారం మండలంలోని పలు ఇనుప ఖనిజ నిక్షేపాలు కలిగిన గుట్టలను పరిశీలించింది. ఇర్సులాపురం, చర్లపల్లి, జాఫరాబాద్, బాలాజీపేట, చిం తోనిగుంపు గ్రామాలను ఆనుకొని ఉన్న పెద్దగుట్టతోపాటు ఇర్సులాపురం శివారులో ఉన్న నక్కలగుట్ట, మెట్ల తిమ్మాపురం శివారులోని ఎర్రమ్మగుట్ట ప్రాంతాలను సభ్యులు పరిశీలించారు. గుట్టల్లో నిక్షిప్తమై ఉన్న ఉక్కు ఖనిజ లభ్యత, నాణ్యతపై ఆరా తీశారు. అధునాతన యంత్రాలను ఉపయెగించి శాంపిల్స్ సేకరించారు. ఈ ప్రదేశంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఎన్ని సంవత్సరాల పాటు ఖనిజం వెలికితీయవచ్చు? పరిశ్రమ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేశారు.
మంత్రి కేటీఆర్ చొరవతో
ఈ ఏడాది జనవరిలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేకించి బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై జేఎస్‌డబ్ల్యూ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్‌తో చర్చించారు. తెలంగాణ ఏర్పా టు సమయంలో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పిన కేటీఆర్.. సెయిల్ సంస్థ కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందన్న విషయా న్ని వారికి గుర్తుచేశారు. జేఎస్‌డబ్ల్యూ వంటి దిగ్గజ సంస్థ బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తే అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బయ్యారం అడవుల్లో జిందాల్ కంపెనీ జియాలజిస్ట్ల బృందం సర్వే చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా గనులను బయ్యారానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా పెడచెవిన పెట్టిందని కేటీఆర్ విమర్శించారు. ఆ గనులను ఇటీవల గుజరాత్ రాష్ట్రం మాద్రాలోని అదానీ కంపెనీకి కేటాయించిందని మంత్రి దుయ్యబట్టారు.