హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ప్రత్యేక రైళ్లలో అదనపు చార్జీల వసూళ్లతో ప్రయాణికుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేజోన్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాలకు ఇప్పటికే సుమారు 100కు పైగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసిన రైల్వే అధికారులు, త్వరలో మరికొన్నింటిని కూడా నడుపనున్నట్టు ప్రకటించారు. ఈ జోన్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ తదితర స్టేషన్ల నుంచి ప్రయాణికులు సంక్రాంతికి తమ సొంతూళ్లకు పెద్ద ఎత్తున వెళ్లి వస్తుంటారు. నెలరోజులపాటు నడిపే ప్రత్యేక రైళ్లలో రద్దీ అధికంగా ఉంటుంది. ప్రయాణికుల నుంచి సాధారణ చార్జీలకు అదనంగా ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో అదనపు చార్జీలపై ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక రైళ్లను నడిపాలని రైల్వే అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.