హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. ప్రధానంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా శనివారం అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా మెదక్‌లో 11.5 డిగ్రీలు, రామగుండంలో 11.6 డిగ్రీలు, హన్మకొండలో 12.5 డిగ్రీలు, దుండిగల్‌లో 13.6 డిగ్రీలు, హైదరాబాద్‌లో 13 డిగ్రీలు, నిజామాబాద్‌లో 13.7 డిగ్రీలు, హకీంపేట్‌లో 14.7 డిగ్రీలు, భద్రాచలంలో 15.2 డిగ్రీలు, ఖమ్మంలో 15.4 డిగ్రీలు, నల్లగొండలో 16 డిగ్రీలు రికార్డయినట్టు పేర్కొన్నారు.