వికారాబాద్ : వికారాబాద్ మండల వ్యవసాయ కార్యాలయం ( Agricultural Office) శిథిలావస్థకు చేరడంతో విష సర్పాలు సంచరిస్తున్నాయి. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న మండల వ్యవసాయ కార్యాలయంలో నాగు పాము( Cobra snake ) హల్చల్ చేసింది. పాము కన్పించడంతో వ్యవసాయ శాఖలో పని చేసే ఉద్యోగులు భయందోళనకు గురయ్యారు.
పాము బుసలు కొట్టడంతో ఉద్యోగులు కార్యాలయం నుంచి బయటకు పరుగులు తీశారు. వ్యవసాయ శాఖ ఉద్యోగులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దాదాపు అర గంట పాటు శ్రమించి అటవీ శాఖ అధికారులు చివరకు పామును పట్టుకున్నారు. దీంతో ఉద్యోగులు ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
శిథిలావస్థకు చేరడంతోనే కార్యాలయంలో పాములు వస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కార్యాలయాన్ని నూతనంగా నిర్మించాలని లేదా ఇతర భవనంలోకి మార్చాలని ఉద్యోగులు కోరుతున్నారు. కార్యాలయం చుట్టూ పక్కల కూడా చెత్తాచెదారం నిలువ ఉండటంతో పాములు వస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు.