ఖమ్మం, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసాన్ని నిషేధిత భూముల జాబితాలో చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. శనివారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ వన్‌టౌన్, టూటౌన్ కమిటీ బీఎల్ఏల ఆత్మీయ సమావేశంలో పార్టీ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డితో కలిసి పువ్వాడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ భూ దోపిడీకి పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. నిషేధిత భూముల జాబితాలో తప్పులు జరిగాయని మంత్రి పొంగులేటి క్షమాపణ చెప్పి వారంరోజులు గడస్తున్నా సవరణలు జరుగకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి ని నిదర్శనమని మండిపడ్డారు. భూభారతి పేరుతో భూ దోపిడీకి యత్నిస్తున్నదని ఆరోపించారు.
గతంలో 9 లక్షల ఎకరాలుగా ఉన్న నిషేధిత భూములు నేడు కోటి ఎకరాలకు ఎలా చేరుకున్నాయో రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని నిలదీశారు. వందశాతం రైతు రుణమాఫీ పూర్తయిందంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారని, అది నిజమని నిరూపించేందుకు బ హిరంగ చర్చకు సిద్ధం కావాలని సవా ల్ విసిరారు. రాజీవ్‌సాగర్ నిర్మాణం పూర్తయిన ఏడాదికే లైనింగ్ కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఎద్దేవాచేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మంలోని జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు 23 ఎకరాలను మంజూరు చేయించానని గుర్తుచేశారు.
వాటిని జర్నలిస్టులకు కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అనంతరం బీఎల్ఏలుగా పనిచేసిన నాయకులను సత్కరించి, ప్రశంసాపత్రాలు అందించారు. రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీజెండా ఎగిరేవరకు విశ్రమించేదిలేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్ఐఆర్(సర్) ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన ఘనత బీఎల్‌ఏలదే అని కొనియాడారు. సమావేశానికి బీఆర్ఎస్ ఖమ్మం నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షత వహించగా.. సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.