నారాయణపేట/మక్తల్/అమరచింత (ఆత్మకూర్), డిసెంబర్ 1 : “ఎక్కడో లోపం జరిగింది. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు పెద్దఎత్తున స్వాగతం పలికేది ఉండె. మనమందరం తప్పులు చేస్తాం. తర్వాత బాధపడితే ఏం లాభం? చానామంది నా మీద దుమ్మెత్తిపోసినా బాధపడలేదు. ఆ పెద్దమనిషి మనదగ్గరకు వస్తే ఈ రోజు మీరు చేసిన ప్రవర్తన నా మనసుకు గాయం చేసింది” అని సీఎం సభసాక్షిగా మంత్రి వాకిటి శ్రీహరి ఆవేదన వెలిబుచ్చారు. సోమవారం మక్తల్‌లో జరిగిన ముఖ్యమంత్రి సభలో ఖాళీ కుర్చీలే కనిపించడంతో మంత్రి మైకులో తన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి గౌరవం దక్కలేదని, ప్రజల నుంచి ఎక్కడో ఏదో తిరస్కృతి పొడసూపుతోందని తెలిసి ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఎంతో చేసినా ఇంతఘోరంగా అవమానించడం ఏంటని., అంత పెద్దమనిషి వస్తే కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడమేంటని తన్నుకొస్తున్న కంటతడిని అదుముకున్న మంత్రి చర్యలు కొత్త ఆలోచనలకు బీజం వేశాయి.
మనల్ని చూడడానికి మన దగ్గరకు వచ్చిన మహానుభావుడికి మనమిచ్చే మర్యాద ఇదేనా..? అని, ఇంకోసారి ఇలాంటిది రిపీట్ కావొద్దని ఒకరకంగా మక్తల్ ప్రజలను బతిమిలాడుతూ అడుక్కున్నంత పని చేసిన శ్రీహరి చర్యలు ఎన్నో చర్చలకు దారితీశాయి. జనాల్లో మార్పు రావాలని కోరుతూనే నిజానికి ప్రభుత్వ తీరులో రావాల్సిన మార్పుపై ఆయన నర్మగర్భంగా మాట్లాడిన విధానం ప్రభుత్వంపై ఎంత ప్రజావ్యతిరేకత ఉందో తెలియజేస్తున్నది. ఎక్కడికెళ్లినా జబ్బలు చరుచుకోవడం, ఎవరినీ పట్టించుకోకుండా తమ గొప్పలను ప్రదర్శిస్తున్న తీరుకు మక్తల్ లో ఎదురు దెబ్బ తగలడంతో మంత్రి ఆ కొద్ది సమయం పూనకంతో ఊగిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ నిజరూపాన్ని తేటతెల్లం చేసింది. ఒక్కరోజుకే అంతగా ఏడిస్తున్న ఆయన తీరుఏమోగానీ, రెండేళ్ల నుంచి తమ ఏడుపు ఎవరికి తెల్వాలనే సోయి తెచ్చుకోవాలనే చర్చ సర్వత్రా సాగుతోంది.
ప్రచారమా.. ఉత్సవమా..?
రాష్ట్రంలో ఒకవైపు గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా మున్సిపాలిటీలకు కోడ్ వర్తించదంటూ ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై నారాయణపేట జిల్లా మక్తల్‌లో సోమవారం నిర్వహించిన మొదటి విజయోత్సవసభ ఆఖరుకు ఎన్నికల ప్రచార సభను తలపించింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఏమాత్రం అవకాశం ఉండకపోవడంతో మక్తల్, ఆత్మకూరు మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టారు. ఆత్మకూర్ మండలం జూరాల సమీపంలో కృష్ణానదిపై అదనపు బ్రిడ్జి నిర్మాణానికి, ఆత్మకూర్ శివారులో 50 పడకల దవాఖాన నిర్మాణానికి, అమరచింత, ఆత్మకూర్ మున్సిపాలిటీలలో రూ.15 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు పీజేపీ క్యాంపు ఆవరణలో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు మంత్రులు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం కాంగ్రెస్ మద్దతు సర్పంచులను గెలిపించుకోవాలని కోరారు. సీఎంతోపాటు మంత్రులు సైతం ఇదే పిలుపునివ్వడంతో అసలు ఇది ప్రజాపాలన విజయోత్సవ సభనా? లేక ఎన్నికల ప్రజా ప్రచార సభనా? అని పలువురు చర్చించుకోవడం కనిపించింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వంశీకృష్ణ, మేఘారెడ్డి, శంకర్, సీతాదయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

పేట-కొడంగల్ ప్రాజెక్టు రెండేండ్లలో పూర్తి..
మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయే రైతులకు ఎకరానికి రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రెండేండ్లలో ప్రాజెక్టు పూర్తి కాకపోతే అధికారులకు, కాంట్రాక్టర్లకు వీపు పగులకొట్టడానికి యువకులు దండుగా సిద్ధమవ్వాలన్నారు.
కాన్వాయ్ ఎదుట నిరసన
పర్యటనలో సీఎం రేవంత్ కు స్థానిక యువకుడు సమ్మద్ నుంచి హామీలెప్పుడు నెరవేరుస్తారని నిరసన సెగ తగిలింది. ప్రజల చిరకాల కోరిక మేరకు ఆత్మకూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రకటించాలి డిమాండ్ చేస్తూ కాన్వాయ్ ఎదుట ప్లకార్డుతో నిరసనకు దిగాడు.
నిబంధనలు పట్టవా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన మక్తల్ సభా సాక్షిగా నిబంధనల పాతర అడుగడుగునా కనిపించింది. ఓ వైపు విద్యా విషయమై సీఎం మాట్లాడుతుండగానే ఓ బాలుడు పల్లీలు అమ్ముతున్న దృశ్యం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అదే సభలో మాగనూరు మండలం కొత్తపల్లి యూపీఎస్ హెచ్ఎం కనిపించడం.. అదే విషయమై ఎంఈవో మురళీధర్‌రెడ్డిని వివరణ కోరితే సమాధానం దాటవేయడం చర్చకు దారి తీసింది. కాగా, సభకు జనాన్ని బలవంతంగా తరలించడం స్పష్టంగా కనిపించింది. సభా ప్రాంగణంలో పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు కనిపించడంపై నవ్వుకున్నారు. కాగా, మాగనూరు మండలం అడవి సత్యవార్ నుంచి ప్రమాదకరంగా విద్యార్థులను ట్రాక్టర్లో తరలించిన నాయకుల తీరుపై స ర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

యథేచ్ఛగా ఉల్లంఘన..
సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ పర్యటన పూర్తిగా కోడ్ ఉల్లంఘన నేపథ్యంగానే సాగిందని పరిశీలిస్తే ఇట్టే తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఆత్మకూర్‌కు హెలీకాప్టర్‌లో వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా కాన్వాయ్‌లో పీజేపీ క్యాంపు ఆవరణకు చేరుకొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ప్రారంభించడం., అనంతరం మక్తల్ సభలో రేవంత్ ప్రసంగం మొత్తం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని చెప్పకనే చెప్పినైట్టెంది. ప్రజలు ఫుల్, ఆఫ్లకు అమ్ముడుపోకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పిన మాటలు పూర్తిగా ఎన్నికల దృష్ట్యానే అనేది తెలిసిపోతున్నది.