హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయనకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికాయి. కానీ, మంత్రులెవరూ ఆయనకు స్వాగతం పలికేందుకు ఆసక్తి చూపించకపోవటం గమనార్హం. దాదాపు 10 మంది మంత్రులు హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ, ఎయిర్‌పోర్టు వరకు ఎదురువెళ్లి ముఖ్యమంత్రికి స్వా గతం పలకటానికి వారు సుముఖత చూపకపోవటం చర్చనీయాంశమైంది.
ఈనెల 16న హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం 17 నుంచి 19వ తేదీ వరకు సింగపూర్‌లో పర్యటించింది. అనంతరం దావోస్‌కు చేరుకుని అక్కడ మరో మూడు రోజుల పాటు డబ్ల్యూఈఎఫ్ సమావేశంలో పాల్గొన్నది. విదేశీ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగివచ్చిన సీఎంకు ఆయన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కాగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇంకా దావోస్‌లోనే ఉన్నారు.