హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ఒకవైపు చేనేత కార్మికుల జీ వితాలను చిన్నాభిన్నం చేసే విధానాలు అనుసరిస్తూ, మరోవైపు తెలంగాణను దక్షిణాసియాలో టెక్స్టైల్ రాజధానిగా మారుస్తామని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడంపై నేతన్నలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఒకవైపు, రాష్ట్రంలో ఉపాధి లేక చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకొంటున్న పరిస్థితులు ఉండగా, మరోవైపు, వారి ఉపాధిని దెబ్బ తీసేలా టెస్కోకు ఇచ్చిన ఆర్డర్లను కాంగ్రెస్ ప్రభు త్వం రద్దుచేస్తున్నది. టెస్కోకు దక్కాల్సిన రూ.200 కోట్ల ఆర్డర్‌ను ప్రభుత్వం ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు రూ.105 కోట్ల స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లను వెనక్కి తీసుకున్నది. శుక్రవారం ‘ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్’లో పాల్గొన్న సీఎం రేవంత్.. చేనేత రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ ఉన్నదని చెప్పడంపై కార్మికు లు మండిపడుతున్నారు. సీఎం మాట లు, చేతలకు అసలు పొంతన లేదని అంటున్నారు. కేసీఆర్ పాలనలో చేతినిండా దొరికిన పనులను సైతం కాంగ్రెస్ సర్కా ర్ నిలిపేసిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. త్రిఫ్ట్, ఇతర సంక్షేమ పథకాలపై రెండున్నరేండ్లుగా నిర్ణయం తీసుకోకపోవడంతో చేనేత కార్మికుల మరమగ్గాల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గుతున్నది. చేయూత పథకం కింద ప్రతినెలా రూ.4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ విస్మరించిందని మండిపడుతున్నారు. కేసీఆర్ హయాంలో చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి బయట పడేసేందుకు రూ.1,200 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం చాలీచాలని నిధులను కేటాయిస్తున్నదన్నారు.
టెక్స్టైల్ రాజధానిగా తెలంగాణ: సీఎం
2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలో టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్-2026లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ డీఎన్ఏ లో చేనేత రంగం ఉన్నదని పేర్కొన్నారు. టెక్స్టైల్ రంగం పరిశ్రమ మాత్రమే కాదని, జీవనాధారమని చెప్పారు.
స్పీచ్ పేపర్లు మిస్సవడంతో ఆందోళన
‘సో వియ్ విల్ క్రియేట్ గ్రీన్ టెక్స్టైల్ హబ్స్’ అని చెప్పి సీఎం రేవంత్ ఆగిపోయారు. ఆదరాబాదరగా స్పీచ్ పేపర్లను తిరగేశారు. స్పీచ్ పేపర్లు దొరకక, ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ఆపేయడంతో సభా ప్రాంగణంలో ఉన్న వారంతా అవాక్కయ్యారు. సీఎం ప్రసంగం ఆగిపోవడంతో అక్కడే ఉన్న కెమెరామెన్లు జనం వైపు తమ కెమెరాలను తిప్పడం కనిపించింది. కాసేపటి తర్వాత సీఎం తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.