హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకాకపోవడం రాష్ట్రంలోని గౌడన్నలను అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ విమర్శించారు. గౌడన్నలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి సీఎం సమయం ఇచ్చి చివరి నిమిషంలో హాజరుకాకపోవడంతో గౌడ గుండెలు మండిపోతున్నాయని చెప్పారు. ఆదివారం ఉదయం ఎలాంటి ఇతర కార్యక్రమాలు లేకపోయినా కూడా ఉద్దేశ పూర్వకంగానే హాజరుకాలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించామని గుర్తుచేశారు. సీఎం హాజరుకాకపోవడం బహుజనులందరిని అవమానపర్చడం, కించపర్చడమేనని అన్నారు. సీఎంకు క్షత్రియ సభకు హాజరుకావడానికి సమయం ఉంటుంది, కానీ గౌడ్లు పూజించే సర్వాయి పాపన్న జయంతికి హాజరుకావడానికి సమయం ఉండదా అని ప్రశ్నించారు. గౌడ్లకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు కాలేదని చెప్పారు.
గౌడలకు అందిస్తున్న మోకు కూడా బీఆర్ఎస్ హయాంలోనే తయారు చేసిందని తెలిపారు. గౌడన్నలు ప్రమాదవశాత్తు చనిపోతే అందించే ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారని, వైన్స్‌లో గౌడ్లకు రిజర్వేషన్లను 25 శాతానికి పెంచుతామన్నారని, కానీ ఇంతవరకు అమలు చేయడంలేదని మండిపడ్డారు. శాట్స్ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీది సంకుచిత సర్కార్ అని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సర్వాయి పాపన్న జయంతికి హాజరుకాకపోవడం బలహీనవర్గాలకు చేసిన అతి పెద్ద గాయమని వ్యాఖ్యానించారు. క్షత్రియ సభకు హాజరై రీల్ హీరోలు కృష్ణంరాజు, ప్రభాస్, రామ్గోపాల్వర్మలను సీఎం పొగిడారని, కానీ రియల్ హీరో సర్దార్ పాపన్న జయంతికి హాజరుకాలేదని మండిపడ్డారు. రేవంత్‌కు ఆత్మసాక్షి లేదు, సామాజిక సృహాకూడా లేదని అన్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెంచుతున్నారని, కల్లు దుకాణాలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ వైఖరిలో మార్పు రాకుంటే అగ్గిబరాటలవుతామని హెచ్చరించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇంజినీరింగ్ సీట్లు పెరిగితే బడుగు బలహీనవర్గాలు చదువుకుంటారన్న ఉద్దేశంతో అడ్డుపుల్లలు వేస్తుందని అన్నారు. సీఎస్ఈలో సీట్లు పెరగకుండా కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. సీఎస్ఈలో సీట్లు పెంచకుంటే ఉన్నత విద్యామండలిని ముట్టడిస్తామని ఆయన ప్రకటించారు.