హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. పట్టించుకోకపోతే జీతంలో 10 శాతం కోత పెడుతామని తేల్చిచెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. జీతం నుంచి కోత పెట్టిన 10 శాతం మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. శనివారం మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో గ్రూప్-1 విజేతలకు సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం, సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.