CM Revanth Reddy | మహబూబ్‌నగర్, నవంబర్10(నమస్తేతెలంగాణప్రతినిధి)/హైదరాబాద్,నమస్తేతెలంగాణ/మూసాపేట/దేవరకద్రరూరల్(చిన్నచింతకుంట): పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కురుమూర్తి (వేంకటేశ్వరస్వామి) మెట్ల మార్గంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పులు వేసుకోవడం వివాదాస్పదంగా మారింది. సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, చివరకు గన్మెన్లు సైతం చెప్పులు లేకుండా కనిపించినా.. ఒక్క సీఎం మాత్రం పాదరక్షలు వేసుకోవడంతో భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీహరి, మధుసూదన్‌రెడ్డితోపాటు కలెక్టర్ విజయేంద్రబోయి, దేవాదాయ శాఖ అధికారులు కురుమూర్తి స్వామి వారిని దర్శించుకున్నారు.
ప్రధాన గోపురం నుంచి గర్భాలయం వరకు కిలోమీటర్ మేర శ్రీవారి మెట్లు ఉంటాయి. వీటిని భక్తులు పరమపవిత్రంగా భావిస్తారు. ‘మా కోరికలు తీర్చండి స్వామి’ అంటూ మెట్లకు పసుపు, కుంకుమతోపాటు హారతులు, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. అలాంటి మెట్లను ఎక్కేటప్పుడు కొంత దూరం చెప్పులతో వెళ్లి.. తిరిగి వచ్చేటప్పుడు కూడా చెప్పులు వేసుకుని ప్రధాన గోపురాన్ని దాటడం కనిపించింది. పక్కనే ఉన్న మందిమార్బలం పాదరక్షలు వేసుకోకున్నా.. సీఎం ఒక్కరే పాదరక్షలు ధరించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శిస్తున్నారు.
కురుమూర్తి స్వామివారి మెట్ల మార్గంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పులు ధరించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేవుడంటే ప్రగాఢ విశ్వాసమని చెప్పే ఆయన పరమ పవిత్రమైన కురుమూర్తి ఆలయాన్ని అవమానించారని పలువురు విమర్శలు గుప్పించారు. హిందూమతానికి బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకొనే బీజేపీ నాయకులు దీనికి ఏం సమాధానం చెబుతారని, ముఖ్యంగా ఆ పార్టీ నేత బండి సంజయ్ దీనిపై స్పందించాలని పలువురు ట్రోల్ చేశారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌లోని కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రూ.110కోట్లతో కురుమూర్తి స్వామి కొండపైకి ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ. కురుమూర్తిస్వామి సాక్షిగా ప్రజల రుణం తీర్చుకునేందుకు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు.
మదనాపురం, నవంబర్ 10: కురుమూర్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో ఆయా పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా మండలకేంద్రంలో ఓ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు బీఆర్ఎస్ బ్యానర్లకు అడ్డుగా తమ ఫ్లెక్సీలు కట్టారు. దుప్పల్లి గ్రామంలో బీఆర్ఎస్కు చెందిన రెండు ఫ్లెక్సీలు కనిపించకుండా పంచాయతీ కార్యదర్శికి చెప్పి మూసివేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఫ్లెక్సీలను గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలతో కప్పడం కొసమెరుపు. సీఎం రేవంత్‌రెడ్డికి ఇతర పార్టీల ఫ్లెక్సీలు కనిపించకుండా ఉండేందుకుగానూ కాంగ్రెస్ నాయకులు ఇలా చేశారని మండిపడుతున్నారు.