హైదరాబాద్ : భారీ వర్షాలతో(Heavy rains) ఆకేరు వాగు(Akeru vagu) పొంగి ఇక్కడే యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ మరణించడం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా వరదలో కొట్టుకుపోయిన అశ్విని కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడారు. అశ్విని (Ashwini)కుటుంబానికి ఇల్లు లేదు. ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి సీతారాం తండాతో పాటు పక్కన ఉన్న మరో రెండు తండాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.ఈ మూడు తండాలు కలిపి ఒకే గ్రామంగా మార్చి అందరికి ఒకే చోట ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేయాలని హౌసింగ్ డిపార్టుమెంట్‌ను ఆదేశించారు. ఆకేరు వాగు పొంగి ఇళ్లలోని పట్టాదారు పాస్ పుస్తకా లు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్స్ తడిచిపోయినందున ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికి నూతన కార్డులు, సర్టిఫికెట్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆకేరు ప్రవాహం నీటి నియంత్రణపై శాస్త్రీయంగా అంచనా వేసి నూతన వంతెన నిర్మిస్తామని సీఎం పేర్కొన్నారు.