హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): గల్ఫ్‌తోపాటు ఇతర దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రజాభవన్‌లో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ పెట్టాలని నిర్ణయించామని తెలిపారు.
మంగళవారం హైదరాబాద్‌లో ఆయన గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ నుంచి ఎకువ మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారని తెలిపారు. ఏజెంట్ల బారిన పడి కొందరు, యాజమాన్యం చేతిలో మరికొందరు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఈ నేపథ్యంలో గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17లోగా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ముసాయిదాను సిద్ధం చేశామని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వివిధ రంగాల నుంచి అభిప్రాయాలను తీసుకొని ముందుకు వెళ్తామని తెలిపారు.
తద్వారా ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా చర్యలు తీసుకోబోతున్నామని, ఏజెంట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గల్ఫ్ వెళ్లే వారికి వారంపాటు శిక్షణ అందిస్తామని చెప్పారు. రైతు బీమా మాదిరిగా గల్ఫ్ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో టీపీసీసీ వరింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, గల్ఫ్ ఎన్నారై కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.