CM Revanth Reddy | యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే మహిళలకు ఫ్రీ బస్ బంద్ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్‌కు ఆయన హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదని వ్యాఖ్యానించారు. మోదీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలాయని ఆరోపించారు.
కేంద్ర సంస్థలను ప్రధాని దుర్వినియోగం చేశారని విమర్శించారు. ‘నల్లగొండలో జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్.. మనకు మనమే పోటీ.. కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి డబుల్ ఇంజిన్లు. నాతో పాటు ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉన్నదంటే అది కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మాత్రమే. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలిస్తే ఇక్కడ ట్రిపుల్ ఇంజిన్లు పనిచేస్తాయి.
చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపిస్తే మూసీ ప్రక్షాళన, గంధమల్ల ప్రాజెక్టు, ఇతర సాగునీటి కాల్వలను పూర్తి చేసే బాధ్యత నాది’ అని వెల్లడించారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తామని తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే పంటలకు రూ.500 బోనస్ ఇచ్చి, ధాన్యాన్ని కొంటామని చెప్పారు. ప్రతి రోజు 1000 నుంచి 1500 మంది ప్రజల సమస్యలు విని, సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజాపాలన కొనసాగుతున్నదని పేర్కొన్నారు.