RRR | హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు.
నిలిచిపోయిన భూసేకరణను రాబోయే 3 నెలలలో పూర్తి చేయాలని, భూసేకరణతో పాటే ఆర్ఆర్ఆర్ (ఉత్తరం) పనులకు టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఆర్ఆర్ఆర్ (దక్షిణం) భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని NHAI ని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు ఆర్థికంగా ఎంత భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే ఏ కార్యానైనా నిర్వహించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తుందని అన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్‌గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ఇందులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తిచేయడానికి కావాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సీఎం చర్చించారు. ఈ రహదారి పూర్తయితే మెరుగైన రవాణా సదుపాయం ఏర్పడి.. సెమీ అర్బన్ జోన్లలో కొత్త పరిశ్రమలు రావటంతో పాటు అభివృద్ధి వేగం పుంజుకుంటుందని అన్నారు.