Revanth Reddy | యాదాద్రి భువనగిరి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం పాదయాత్ర షోపుటప్, హంగామా, డ్రామాను తలపించింది. మూసీపై ఏదో చేస్తున్నామనే భ్రమ కల్పించాలని భావించి చేపట్టిన కార్యక్రమం కాస్తా అట్టర్ ఫ్లాప్ అయిందనే చర్చ నడుస్తున్నది. ‘అంతా స్క్రిప్టెడ్, ప్రీప్లాన్డ్.. పెయిడ్ కార్యకర్తలు.. ప్రతిపక్షాన్ని విమర్శించేందుకే రేవంత్ ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టు ఉన్నది’ అనే విమర్శలు గుప్పుమన్నాయి.
రేవంత్ పాదయాత్ర నేపథ్యంలో వలిగొండ మండలం సంగెం బ్రిడ్జి వద్ద కొత్త సినిమానే చూపించే ప్రయత్నం చేశారు. సినిమా సెట్‌లా అప్పటికప్పుడు ఒడ్డున బోట్లు, తెప్పలు వేయించారు. ఎంపిక చేసిన వారినే పాదయాత్రలో సీఎం వెంట నడిపించారు. బోట్లు, తెప్పల వద్ద వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలనే నిలబెట్టారు. వారిని పలకరిస్తే ‘అధికారుల ఆదేశాల మేరకు వచ్చినం’ అని చెప్పడం కొసమెరుపు. వారికి ఐడీ కార్డులు కూడా ఇవ్వడం గమనార్హం. గుర్తింపు కార్డులో మాత్రం గజ ఈతగాళ్లు అని అధికారులు పేర్కొన్నారు. మూసీ నీటితో చేపలు బతకడం లేదని, శుద్ధి చేయాలని రేవంత్‌రెడ్డి ముచ్చటించిన మత్స్యకారుడు యాదయ్య కోరారు. ఆయన సొంతూరు పోచంపల్లి. అక్కడ ఉన్నవారితో రేవంత్‌రెడ్డి మాట్లాడిపోయిన పావు గంటలోనే గజ ఈతగాళ్ల పేరుతో వచ్చిన వాళ్లు తమ తట్టాబుట్టా సర్దుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడం కనిపించింది. కార్యక్రమం కోసం తాత్కాలికం వీరిని తీసుకొచ్చి కథ నడిపించారని విమర్శలు వినిపించాయి.
రేవంత్‌రెడ్డి పాదయాత్ర అనంతరం ప్రచారరథంపై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అంతకంటే ముందు మరోసారి కథ రక్తి కట్టించే ప్లాన్ చేశారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి అప్పటికే తాను ఓ పేపర్లో రాసుకొచ్చిన పేర్లను ఒక్కొక్కరిగా ప్రచార రథంపైకి పిలిచి ప్రసంగించాలని ఆహ్వానించారు. సదరు వ్యక్తులను కుల వృత్తిదారులుగా పరిచయం చేశారు. వేదికపై ప్రసంగించిన కే వెంకటేశ్, నాగరాజు ఇద్దరూ కాంగ్రెస్‌కు చెందిన వారే కావడం గమనార్హం. ఇద్దరి ప్రసంగాల్లోనూ రేవంత్‌రెడ్డిని ప్రశంసలు, పొగడ్తలతో ఆకాశానికెత్తారు. ఇప్పుడే అంతా ఏదో జరిగిపోయినట్టు మాట్లాడారు. సీపీఎం నేత ఐలయ్యకు కూడా అవకాశం ఇవ్వగా సీఎం దేవుడు, గొప్ప వ్యక్తి, శిరస్సు వంచి వందనాలు అంటూ మాట్లాడటం గమనార్హం. అంతకుముందు పాదయాత్ర సందర్భంగా సీఎం ముచ్చటించిన వృత్తిదారులకు కూడా ముందు రోజే అధికారులు స్క్రిప్ట్ ఇచ్చి తర్ఫీదు ఇచ్చినట్టు తెలిసింది.
రేవంత్‌రెడ్డి పాదయాత్ర షెడ్యూల్‌కు, అమలుకు సంబంధమే లేకుండా పోయింది. మొదట 6 కిలోమీటర్ల మేర సీఎం పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. కానీ 2.25 కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర కొనసాగింది. ధర్మారెడ్డిపల్లి కాల్వ వైపు వెళ్తున్న క్రమంలో మధ్యలోనే కుదించారు. పాదయాత్ర ఆసాంతం గందరగోళంగా మారింది. అంతకుముందు రేవంత్‌రెడ్డి రెండు సార్లు మూసీలోకి దిగి ఫొటోలకు ఫోజులిచ్చారు.
సీఎం యాత్రలో అన్ని విభాగాల అధికారులను భాగస్వాములను చేశారు. కలెక్టర్ హనుమంతరావు అన్ని విభాగాల అధిపతులో సమీక్ష నిర్వహించి బాధ్యతలు అప్పగించారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సుమారు వెయ్యి మంది అధికారులు విధులు నిర్వర్తించారు. పాదయాత్రలో ఎక్కడ చూసినా అధికారులే కనిపించారు. సుమారు 2 వేల మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించినట్టు అధికారులు తెలిపారు.
సుమారు 30వేల మందితో కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తామని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పారు. కానీ 3 వేల మంది కూడా వచ్చినట్టు అనిపించలేదు. మధ్యాహ్న సమయంలో వచ్చిన కొందరు సాయంత్రానికి ఇంటిబాట పట్టారు. రేవంత్‌రెడ్డి ప్రసంగించే సమయంలో పెద్దగా జనం లేరు. ఎటు చూసినా ఖాళీ ప్రదేశాలే కనిపించాయి. నాలుగు వైపులా ఉన్న సింగిల్ రోడ్లుకూడా నిండకపోవడం గమనార్హం.
మూసీ పరిసర ప్రాంతాల రైతులు, వృత్తిదారులతో సీఎం సమావేశమవుతారని, కర్షకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. మూడు రోజులుగా ముమ్మర కసరత్తు చేశారు. కానీ శుక్రవారం జరిగిన యాత్రలో రైతులు పత్తాలేరు. కనీసం చూద్దామన్నా ఎక్కడా వారు కనపడలేదు. ఎక్కడ చూసినా తెల్ల అంగీలు తొడుక్కున్న కాంగ్రెస్ కార్యకర్తలే దర్శనమిచ్చారు. అనేక చోట్ల మెడలో కండువాలు, చేతిలో జెండాలు పట్టుకొని కనిపించారు. వాళ్లు కూడా పెయిడ్ కార్యకర్తలే అవడం గమనార్హం. పాదయాత్రకు తరలివచ్చిన ఒక్కో కార్యకర్తకు రూ.300 చొప్పున ఇచ్చి తీసుకొచ్చారు. మహిళలు ఎక్కడా కనిపించలేదు. రేవంత్‌రెడ్డి జన్మదినం కూడా కావడంతో బయటి నుంచి కొందరు కాంగ్రెస్ నేతలు, అభిమానులు తరలివచ్చారు.