CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూళ్లల్లో ఇంటర్ పాసైనోళ్లు.. డిగ్రీ ఫెయిలైనోళ్లే పాఠాలు చెప్తున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సర్కారు స్కూళ్లల్లో పనిచేసే వారితో పోల్చితే సగం చదువుకున్నోళ్లే ప్రైవేట్ పాఠశాలల్లో బోధిస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ టీచర్లు సర్కారు టీచర్ల కంటే గొప్పవారేమీ కాదని వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో ‘నూతనంగా పదోన్నతి పొందిన టీచర్లతో ముఖ్యమంత్రి ముఖాముఖి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సభలో సీఎం మాట్లాడుతూ ‘ఎంఏ, బీఈడీ, డాక్టరేట్ వంటి ఉన్నత చదువులు చదువుకున్నోళ్లు సర్కారు టీచర్లుగా పనిచేస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్ పాసైనోళ్లు, డిగ్రీ ఫెయిలైనోళ్లు పాఠాలు చెప్తున్నారు’ అని తెలిపారు. టీచర్లు తేనేతుట్టెలాంటివారు అని, వారిని ముట్టుకోవద్దని చాలా మంది సలహానిచ్చారని గుర్తుచేశారు. తమకు హాని చేయాలని చూస్తే తేనేటీగల్లా టీచర్లు ఎదురుదాడిగి దిగుతారని చెప్పిన సీఎం.. టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. విద్యకు రూ.30 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, ఇతర హామీల అమలు దృష్ట్యా తాజా బడ్జెట్లో రూ.21 వేల కోట్లు మాత్రమే కేటాయించామని తెలిపారు. ‘ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది కంటే రెండు లక్షలకుపైగా అడ్మిషన్లు తగ్గాయి. 30 వేల సర్కారు పాఠశాలల్లో 26 లక్షల మంది ఉంటే అదే 10 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో సర్కారు టీచర్లకంటే గొప్ప టీచర్లున్నారా?’ అని ప్రశ్నించారు. రేపే ప్రభుత్వ పాఠశాల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తామని, 30 వేల పాఠశాలలకు ఉచిత విద్యత్తునిస్తామని, ఈ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు.
ముఖం చూపించి వెళ్లిపోయారంతే!
టీచర్లతో ముఖాముఖి అని చెప్పి.. సీఎం తమకు ముఖం చూపించి వెళ్లిపోయారని సభకు వచ్చిన పలువురు టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల అసహనం వ్యక్తంచేశారు. తమకు స్పష్టమైన హామీలేవీ ఇవ్వలేదని, కనీసం మమ్మల్ని సభలో మాట్లాడించలేదని, ముఖాముఖి అంటే తమతో మాట్లాడిస్తారని అనుకున్నామని, కనీసం టీచర్ ఎమ్మెల్సీలను కూడా మాట్లాడించలేదని ఓ నేత వాపోయారు.