Musi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ పక్కలో బల్లెంలా పాకిస్థాన్ మారింది. సరిహద్దు కయ్యాలతో డ్రాగన్ దేశం చైనా తరుచూ భారత్‌పై తన విషాన్ని చిమ్ముతున్నది. దేశ అస్తిత్వానికే ముప్పుగా మారిన ఈ రెండు దేశాలతో సీఎం రేవంత్ సర్కారు తీసుకొచ్చిన ‘మూసీ రివర్ ఫ్రంట్’ ప్రాజెక్టు ముడిపడి ఉండటం సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. పాకిస్థాన్‌లో పలు కుంభకోణాలకు పాల్పడిన మెయిన్‌హార్ట్ కంపెనీకి ‘మూసీ రివర్ ఫ్రంట్’ అభివృద్ధి పనులను కట్టబెట్టగా, ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల్లో మెజార్టీ డబ్బులను చైనా కేంద్రంగా పనిచేస్తున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంకు సమకూర్చనున్నట్టు తేలడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) డైరెక్టర్ జనరల్ పాండ్యన్‌ను సీఎం రేవంత్ రెడ్డి గత ఫిబ్రవరి 1న రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మూసీ పునరుద్ధరణ పనుల్ని చేపట్టబోతున్నామని, మూసీ పరీవాహక ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని బ్యాంకు ద్వారా అందించాలని పాండ్యన్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన పాండ్యన్.. మూసీ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమకూరుస్తామని హామీనిచ్చారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశమున్నట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. అలా చైనా కేంద్రంగా కార్యకలాపాలు జరుపుతున్న ఓ బ్యాంకు మూసీ రివర్ ఫ్రంట్‌లో భాగమౌతున్నట్టు అర్థమవుతున్నది.
ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ తమిళనాడుకు చెందినవారు. అంతేకాదు, ఆయన న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ పాండ్యన్‌కు మంచి మిత్రుడిగా చెప్తారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఆర్థిక వనరులు సమకూర్చడంలో ఈశ్వరన్ కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. అంతేకాదు.. ఏపీ రాజధాని అమరావతి నగరాభివృద్ధికి కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంకు అండదండలు అందించనున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని ధ్రువపరుస్తూ.. గత జూలై 26న ఏపీ సీఎం చంద్రబాబు పాండ్యన్‌తో సమావేశమవ్వడం, అనంతరం అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడటం గమనార్హం.
బ్రిక్స్ కూటమి దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలో ప్రభుత్వాలు లేదా ప్రైవేటు కంపెనీలు చేపట్టే పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయాన్ని సమకూర్చే లక్ష్యంతో 2014లో బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకు ఏర్పడింది. అయి తే, కూటమిలోని దేశాలపై ఆధిపత్యం సాధించే ఉద్దేశంతో బ్యాంకు ప్రధాన కార్యాలయం తమ దేశంలోనే ఏర్పాటు చేయాలని, అలా అయితేనే బ్యాంకు ఏర్పాటుకు, ఆర్థిక సహకారానికి సాయమందిస్తామని చైనా మెలిక పెట్టింది. దీంతో సభ్య దేశాలు సరేనన్నాయి. అలా షాంఘైలో ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశా రు. అనంతరం బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకు పేరును న్యూ డెవలప్మెంట్ బ్యాంకుగా మారుస్తున్నట్టు చైనా ప్రకటించింది. ఇక, బ్యాంకులో బ్రిక్స్ కూటమిలోని ఒక్కో దేశం షేర్ వాటా 18.45 శాతానికి పరిమితంకాగా.. చైనా వాటా 26.2 శాతంగా ఉన్నది. దీనికోసం బంగ్లాదేశ్, అల్జీరియా, ఈజిప్ట్, యూఏఈ, ఉరుగ్వే తదితర దేశాలను బ్యాంకులో పరోక్ష భాగస్వాములుగా చైనా చేర్చింది. అలా న్యూ డెవలప్మెంట్ బ్యాం కుపై చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకొన్నది.