KTR | కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందని పిచ్చోడిలా గాయి గాయి చేసిన రేవంత్ రెడ్డి చెంప ఛెల్లుమనేలా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్నట్టుగా తమ హయాంలో రాష్ట్ర అప్పు 8 లక్షల కోట్లు కాదని, కేవలం 3.5 లక్షల కోట్లు మాత్రమే అన్న నిజాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలన్న సంగతి పార్లమెంట్లో ఇవాళ నిరూపించబడిందని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి రూ. 8 లక్షల కోట్ల అప్పులంటూ నిరాధార ప్రచారానికి దిగిన రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని కేటీఆర్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తలకు మించిన అప్పులు చేయలేదని కేటీఆర్ తెలిపారు. తాము అధికారం నుంచి దిగిపోయిన తర్వాత అంటే 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ. 3,50,520.39 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అనవసరంగా అప్పులు చేయలేదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలకే కాకుండా, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆస్తుల సృష్టి కోసమే తెచ్చిన అప్పులను ఉపయోగించిందని వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు వివిధ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ నిధులను ఖర్చు చేసిందన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ, సమర్థతతోనే రాష్ట్రం వేగంగా పురోగమించిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలివిగా ఆర్థిక నిర్వహణ చేసిన సంగతి కేంద్రం ఇచ్చిన నివేదికతో తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ అప్పులు రూ. 3,50,520.39 కోట్లు అయితే, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల విలువ రూ. 4,15,099.69 కోట్లుగా ఉందని తెలిపారు. అంటే, అప్పుల కంటే ఆస్తుల విలువ రూ. 64,579 కోట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. గత ఆరు ఆర్థిక సంవత్సరాలుగా (2018-19 నుండి 2023-24 వరకు) ప్రతి ఏటా తెలంగాణ అప్పుల కంటే ఆస్తుల విలువ రూ. 50 వేల కోట్లకు పైగా పెరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సమర్థతకు ఈ గణాంకాలే నిదర్శనం అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. తాను ముఖ్యమంత్రి అయిన మరు క్షణం నుంచే విపరీతంగా అప్పులు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 2023 డిసెంబర్ నుంచి అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ మార్గాల ద్వారా రూ. 1.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ అప్పులు చేసినట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అంగీకరించిన సంగతిని కేటీఆర్ గుర్తుచేశారు. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండానే, హామీ ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలుచేయకుండానే రేవంత్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు ఎందుకు చేసిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వ అనాలోచిత, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణతో తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతుందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేంద్రం ఇచ్చిన గణాంకాలపై ఏం సమాధానం చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. నిజాలు తెలుసుకుని, నిరాధారమైన ఆరోపణలు మానుకుని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పారదర్శకత లేని ఆర్థిక విధానాలను అవలంబిస్తూ, అప్పులను ప్రజల మీద మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా తమ పరిపాలన గురించి సమీక్షించుకోవాలన్నారు.