CM Revanth Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): భగవద్గీత బోధనానుసారమే చెరువులను కాపాడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కోకాపేటలో హరేకృష్ణ ఫౌండేషన్ 430 అడుగుల ఎత్తుతో నిర్మించతలపెట్టిన హెరిటేజ్ టవర్ పనులకు ముఖ్యమంత్రి ఆదివారం శంకుస్థాపన చేసి, మాట్లాడారు. వందేళ్ల క్రితమే హైదరాబాద్‌ను నిజాం లేక్ సిటీగా అభివృద్ధి చేశారని వెల్లడించారు. దాహార్తిని తీర్చే చెరువుల పరిధిలో విలాసాల కోసం కొందరు ఫామ్ హౌస్‌లు నిర్మించుకున్నారని, గండిపేట్, హిమాయత్ సాగర్‌లోకి ఫామ్‌హౌస్‌ల నుంచి వ్యర్థాలు వదులుతున్నారని తెలిపారు. హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని, రాజకీయాలు, కక్షల కోసం చేపట్టిన కార్యక్రమం కాదని స్పష్టం చేశారు.
శాంతిసరోవర్కు అండగా ఉంటాం
గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ క్యాంపస్‌లో నిర్వహించిన ‘బ్రహ్మ కుమారీస్ – శాంతి సరోవర్’ ద్వి దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మకుమారీస్ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని తెలిపారు. మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీ రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిత్రుల ఫాంహౌస్‌లను వదలం
మిత్రుల ఫాంహౌస్‌లు ఉన్నా తొలగించేందుకే హైడ్రాను ఏర్పాటు చేసినట్టు రేవంత్ చెప్పారు. ప్రభుత్వంలో భాగస్వాములైనా వాటన్నింటినీ పట్టించుకోదల్చుకోలేదు’ అని సీఎం నొక్కి చెప్పారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న వేదికపైనే ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఉన్నారు. కొన్ని రోజులుగా పట్నం మహేందర్‌రెడ్డి ఫాంహౌస్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పట్నం ఫాంహౌస్‌ను కూల్చుతారా? వదిలేస్తారా? అని అక్కడి వచ్చిన ప్రజలు గుసగుసగా మాట్లాడుకోవడం కనిపించింది.