హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎనలేనిదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాజులకు శ్రమ, పట్టుదల ఎక్కువని, వారు ఏ రంగంలోనైనా రాణిస్తారని కొనియాడారు. సినీ రంగంలో కృష్ణంరాజు ఉన్నత స్థాయికి ఎదిగితే.. ఇప్పుడు ఆయన వారసుడు ప్రభాస్ హాలీవుడ్‌తో పోటీపడేలా రాణిస్తున్నారని ఉదహరించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో బోసురాజు అత్యంత క్రియాశీల పాత్ర పోషించారని చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోయినా పార్టీ విజయం కోసం బోసురాజు కష్టపడి పనిచేశారని, అందుకే ఆయనకు రాహుల్ గాంధీ మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో క్షత్రియులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. క్షత్రియుల తరఫున శ్రీనివాసరాజును తమ ప్రభుత్వంలో సలహాదారుగా నియమించామని, యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీ కో-చైర్మన్‌గా శ్రీనిరాజును నియమించామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని క్షత్రియులకు పిలుపునిచ్చారు. క్షత్రియభవన్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించడంతోపాటు అవసరమైన సహకారాన్ని అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక మంత్రి బోసురాజు, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తదితరులు పాల్గొన్నారు.