Congress | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): దశాబ్దకాలంగా పార్టీ అధికారంలో లేకున్నా అంటిపెట్టుకుని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి కాకుండా, కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇస్తారా? ఇదెక్కడి న్యాయం? అంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. పార్టీ తీర్థం పుచ్చుకొనే కొత్తవారికి టికెట్ ససేమిరా ఇవ్వవద్దంటూ పట్టుబడుతున్నాయి. సీనియర్లను కాదని కొత్తవారికి టికెట్లు ఎలా ఇస్తారని నిలదీస్తున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటి వరకు నాలుగింటిని మాత్రమే ప్రకటించిన కాంగ్రెస్ మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై గాంధీభవన్‌లో రెండురోజులుగా కసరత్తు చేస్తున్నది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్లు తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు. పార్టీ అధికారంలోకి రాగానే ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతున్న నేతలకు టికెట్లు ఇవ్వడం సరికాదని, ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్తున్నారు. స్పందించిన మున్షీ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కాంగ్రెస్ ఇప్పటి వరకు మహబూబ్‌నగర్, మహబూబాబాద్, జహీరాబాద్, నల్లగొండ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 13 స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, అధికారికంగా మాత్రమే ప్రకటించాల్సి ఉందన్న వార్తలు పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
నిన్నకాకమొన్న బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్నకు సికింద్రాబాద్ టికెట్ ఇస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీనైన తనకు కాకుండా కొత్తగా వచ్చి చేరినవారికి ఎలా ఇస్తారంటూ దీపాదాస్ మున్షీని నిలదీసినట్టు తెలిసింది. భువనగిరి టికెట్‌ను ఇటీవల అక్కడ ఓటమి పాలైన ఓ నేతకు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుండడంతో కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తన అసంతృప్తిని వ్యక్తంచేసినట్టు సమాచారం. పెద్దపల్లి టికెట్‌ను వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకి ఇస్తున్నారన్న ఊహాగానాలపైనా కాంగ్రెస్ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి వచ్చిన వివేక్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, ఇప్పుడు ఆయన కుమారుడికి ఇస్తామంటే ఎలా అని మున్షీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఒకే కుటుంబానికి ఇన్నేసి టికెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించినట్టు సమాచారం. ఇటీవల పార్టీలో చేరిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డికి మల్కాజ్గిరి టికెట్ ఖాయమంటూ వస్తున్న వార్తలపైనా నాయకులు గుర్రుగా ఉన్నారు. అభిప్రాయ సేకరణలో నేతలు వెల్లడించిన అభిప్రాయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దీపాదాస్ హామీ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు, ఎంపీ టికెట్ల ఖరారుపై శుక్రవారం ఢిల్లీలో జరగనున్న ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ ఢిల్లీకి వెళ్లడం ఇది 11వసారి కానుంది.