నాగర్‌కర్నూల్, నవంబర్ 3: శ్రీశైలం ఎడమ కాల్వ ప్రాజెక్టు సొరంగం (ఎస్ఎల్బీసీ) మార్గం పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక టన్నెల్ టెక్నాలజీతో పనులు చేపడతామని తెలిపారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా మన్నెవారిపల్లి వద్ద ఎస్ఎల్బీసీ హెలీ మాగ్నెటిక్ సర్వేను హెలికాప్టర్లో వచ్చి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సీఎం పరిశీలించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వివరాలతో కూడిన ఫొటో ఫీచర్‌ను తిలకించి, పరికరాలను పరిశీలించారు. నేషనల్ జియోఫిజికల్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చేపడుతున్న మాగ్నెటిక్ జియోఫిజిక్ సర్వే వివరాలను ముఖ్యమంత్రి, మంత్రులకు అధికారులు వివరించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం లో 2004లో రాజశేఖర్‌రెడ్డి టన్నెల్-1, టన్నెల్-2 పనులను ప్రారంభించారని, అప్పట్లో రూ.2 వేల కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేదని, ఇప్పుడు పెరిగిన అంచనాలతో రూ.4,600 కోట్లతో పూర్తిచేయాల్సి వస్తుందని చెప్పారు.
ఇది పూర్తయితే 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. ఈ పనులు చేపట్టిన క్రమంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. టన్నెల్‌ను పూర్తి చేసేందుకు ఆర్మీ అధికారులను డిప్యూటేషన్‌పై తెలంగాణాకు తీసుకొచ్చినట్టు వెల్లడించారు. ఇంకా 9.8 కిలోమీటర్ల పనులు పూర్తి కావాల్సి ఉన్నదని తెలిపారు. గిరిజనులకు న్యాయం చేసి వారికి నష్టం జరగకుండా ఆదుకుంటామని, అన్ని తండాల వారికి డిసెంబర్ 31లోగా సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ప్రాధాన్య క్రమంలో పనులు పూర్తిచేస్తామని తెలిపారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రెండేండ్లలో ఎస్ఎల్బీసీని పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ఈ టన్నెల్ పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టు కంటే ఎక్కువ నీరు వచ్చి.. రైతుల ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ పూర్తయితే 3 లక్షల ఎకరాలకు సాగునీరుతోపాటు నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ లేకుండా చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.