హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనమండలి, శాసనసభ సమావేశాలను పక్కపక్కనే నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే శాసనమండలి సమావేశాలను పాత అసెంబ్లీ సమావేశ మందిరంలో (ప్రస్తుత అసెంబ్లీ సమావేశ మందిరం పక్కన ఉన్న) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులకు సూచించారు. ఈలోగా అవసరమైన మరమ్మతులు, సుందరీకరణ పనులు పూర్తిచేయాలని కోరారు. బుధవారం ఆయన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలిసి అసెంబ్లీ, శాసనమండలి ప్రాంగణాలను కలియతిరిగారు. అసెంబ్లీ లోపల సెంట్రల్‌హాల్ పక్కనే మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంటీన్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అసెంబ్లీ లాబీకి ఇరువైపులా ఉన్న హాల్స్, పై అంతస్థుల్లోని అసెంబ్లీ హాల్స్‌ను పరిశీలించారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. అక్కడి నుంచి నేరుగా శాసనసమండలికి వెళ్లేదారిలో (అసెంబ్లీ వెనుక) ఉన్న ఉద్యానవనాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి శాసనమండలికి చేరుకుని కలియతిరిగారు.
పార్లమెంట్ లాంజ్ తరహాలో సుందరీకరణ
శాసనమండలికి, శాసనసభకు మధ్య ఉన్న ప్రాంతాన్నంతా నూతన పార్లమెంటు తరహాలో సుందరీకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు, ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. ఫిట్నెస్ సెంటర్, సెంట్రల్ లైటింగ్, ఎటుచూసినా ఆహ్లాదకరంగా ఉండేలా పరిసర ప్రాంతాలను సుందరీకరించాలని చెప్పారు. అవసరమైతే అసెంబ్లీ సమావేశాల అనంతరం నూతన పార్లమెంటు (సెంట్రల్ విస్టా) ప్రాంగణాన్ని పరిశీలించి రావాలని అసెంబ్లీ కార్యదర్శికి సూచించారు. ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న పలు పార్టీల శాసనసభాపక్ష కార్యాలయాలను కూల్చివేసి వాటిని మరోచోట నిర్మించడంతోపాటు ప్రజాప్రతినిధుల వాహన పార్కింగ్ స్థలాలు తదితర ప్రతిపాదనలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డిని ఆదేశించారు.
మండలిని పరిశీలించిన సీఎం
రాష్ట్ర శాసనమండలి, పరిసర ప్రాంగణాలను బుధవారం పరిశీలించేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్లో సన్మానించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ధనసరి అనసూయ (సీతక), కొండ సురేఖ తదితరులు శాసనమండలి ప్రాంగణం, సమావేశ మందిరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ వారిని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.