హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తేతెలంగాణ) : కుక్కల దాడిలో గాయపడి మూడు నెలలుగా కోమాలో ఉన్న బాలికకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నందికొండకు చెందిన హారిక కొద్ది రోజుల క్రితం ఇంటిముందు ఆడుకుంటుండగా కుక్కలు దాడిచేశాయి.
తీవ్రంగా గాయపడిన హరిక కోమాలోకి వెళ్లింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు దవాఖానల చుట్టూ తిప్పుతున్నప్పటికీ నయం కాలేదు. తండ్రి చనిపోవడం, తల్లి మాత్రమే ఉండి కడుపేద జీవితాన్ని గడుపుతున్న హారిక బాధలపై పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి పత్రికల్లో వచ్చిన వార్తకు స్పందించి.. బాలిక కుటుంబసభ్యులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. హారిక కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.