హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. యాదగిరిగుట్ట అభివృద్ధిపై శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధి పెండింగ్ పనుల వివరాల నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆలయ అభివృద్ధి పనులను అర్ధాంతరంగా వదిలేయడానికి వీళ్లేదని చెప్పారు. భక్తులకు సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాల మేరకు చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన వివరాలు అందించాలని కోరారు. ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్టు తనకు అందించాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యాలు, విడిది కాటేజీల నిర్మాణాలకు దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని చెప్పారు.
రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించాలని శుక్రవారం సచివాలయంలో స్పీడ్ ప్రాజెక్టులపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ర్టాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని, ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి ప్రాంతంలో 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని చెప్పారు. హైదరాబాద్ బయట దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వనరుల అభివృద్ధికి అవసరమైన చోట పీపీపీ విధానాన్ని అవలంబించాలని సూచించారు. సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శుక్రవారమే సీఎం రేవంత్‌రెడ్డిని వేములవాడ ఆలయ అర్చకులు కలిసి ఆశీర్వచనం అందించారు. ఆలయ విస్తరణ డిజైన్ల నమూనాకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని ఆలయ అర్చకులు సీఎంకు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో విప్ ఆది శ్రీనివాస్, ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేశ్, డీఈఈ రఘునందన్, ప్రధాన అర్చకుడు ఉమేశ్ శర్మ తదితరులు ఉన్నారు.