రాష్ట్రం ఆర్థికంగా బాగాలేదు.. అప్పు పుడుతలేదు.. ఎవడూ అణాపైసా ఇస్తలేడు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నరు. ఢిల్లీకి పోతే వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుక పోయేటట్టున్నడని ఎవడు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు. దేశం ముందర ఆ పరిస్థితి ఉన్నది. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి ఇచ్చేటోన్ని. ఎవడూ బజార్ల నమ్ముతలేడు. నన్ను కోసినా 18500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు.ఏం జేస్తరయ్యా నన్ను.. చెప్పుండ్రి? ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్న ఏంజేస్తరు నన్ను? కోసుకొని తింటరా? ఏం జేస్తరు?
ఉన్నదే 18500 కోట్లు. ఎట్ల పంచుదామో చెప్పుండ్రి. ఏది ఆపుమంటరో చెప్పుండ్రి? వృద్ధాప్య పింఛన్లు ఆపుమంటరా? ఉచిత కరెంటు ఆపుమంటరా? షాదీముబారక్ ఆపుమంటరా? ఏది ఆపుతరో ప్రజలకు చెప్పుండ్రి? అయ్యా..! మీది ఆపేసి మేం బోనస్‌లు తీసుకుంటం.. జీతాలు పెంచుకుంటం.. మేం తినంగ మిగిలితే మీకు ఇస్తం అని ప్రజలకు చెప్తామంటే.. చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం. 10 లక్షల మందిని తెస్తా.. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి.. ఇగో ముఖ్యమంత్రికి ఈ చిట్టీ ఇచ్చినం దీని ప్రకారం పరిపాలన జరుగుతుందని చెప్పండి.
పీఆర్సీ ప్రకటించాలని, కరువు భత్యాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి నిస్సహాయంగా చేతులెత్తేసిన స్థితిలో వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా రాష్ట్రం దివాలా స్థితిలో ఉన్నదని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులపై తీవ్రంగా మండిపడ్డారు. పథకాలను ఆపేయడం లేదా పన్నులు పెంచి ప్రజలపై భారం మోపడం అనే రెండింటిలో ఏదో ఒకటి చేస్తే తప్ప ఉద్యోగుల కోర్కెలు నెరవేర్చలేమని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరం అని ప్రకటిస్తున్నారు.. ఎవరి మీద మీ సమరం? తెలంగాణ ప్రజలపైనా?’ అని ప్రశ్నించారు. సోమవారం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy | హైదరాబాద్, మే05(నమస్తే తెలంగాణ): “రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది. పైసా కూడా బయట అప్పు పుడత లేదు. అణాపైసా ఎవడూ ఇస్తలేడు. తెలంగాణ ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నరు. ఎవరి మీద మీ సమరం. ప్రజలపై యుద్ధం చేసినవాడు బాగుపడినట్టు లేదు” అంటూ పలు సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “ధనిక రాష్ట్రంగా ఏర్పడి 72 వేల కోట్ల రూపాయల అప్పు, ఆనాడు రామకృష్టారావును అడిగా. దాదాపు 9 సంవత్సరాల నుంచి ఫైనాన్స్ సెక్రటరీగా ఆయనే పనిచేస్తున్నరు. రాష్ట్రం వచ్చినప్పుడు అప్పు,అసలు, మిత్తి ఎంత అని అడిగితే, నెలకు ఐదారు వందల కోట్ల రూపాయలు సర్, సంవత్సరానికి రూ.6000 నుంచి రూ.6,500 కోట్లు మనం అప్పు కట్టేది అని చెప్పారు.
ఇప్పుడు నేను అడిగిన ఇప్పుడు ఎంత కడుతున్నరని. డిసెంబర్ 7, 2023 నుంచి మార్చి 31, 2025 నాటికి 1.52 లక్షల కోట్ల అప్పులు, అసలు, మిత్తం కట్టినం సర్ అని చెప్పారు” అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. “మనం తెచ్చిన అప్పు రూ.1.58 లక్షల కోట్లు. 16 నెలల్లో మనం అప్పు చేస్తే, పోయినాయిన చేసిన అప్పుకు, అసలుకు, మిత్తికి రూ. 1.52 లక్షల కోట్లు కట్టినం సర్. తెచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా ప్రజా సంక్షేమానికి, ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసమో వాడలేదు. రూ 8.29 లక్షల కోట్లు ఆయన పెట్టిపోయిన బకాయిలకు, ఈ తెచ్చిన సొమ్మంతా చెల్లించినం సర్ అని చీఫ్ సెక్రటరీ రామకృష్టారావు చెప్పారు. ఈ రోజు ఎంతకడుతున్నమంటే, నెలకు రూ. 7 వేల కోట్లు అసలు, మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఉంది సర్. మనం తిన్నా, తినకపోయినా అప్పులోడికి మనం నెలకు రూ. 7 వేల కోట్లు ప్రతి నెలా కట్టాల్సిందే సర్ అని రామకృష్ణారావు చెప్పారు” అని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో అందాల పోటీల ఏర్పాట్ల కోసమని ప్రభుత్వం పెడుతున్న ఖర్చు లెక్క దాదాపు 200 కోట్లు!
హైదరాబాద్‌లో పైలాన్లు కట్టడం, మూసీలో బోట్లు నడపడం ఎట్లానో తెలుసుకునేందుకు టూరిజం శాఖ విదేశాలకు పంపిన 10 మంది బృందానికి అయిన ఖర్చు లెక్క దాదాపు 4.52 కోట్లు!
అధ్యయనాల పేరిట జీహెచ్ఎంసీ కమిషనర్ మొదలుకొని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి దాకా గత ఏడాదిన్నరలో చేసిన ఖర్చు లెక్క దాదాపు 22.02 కోట్లు!
100 కిలోమీటర్ల దూరానికి కూడా మంత్రులు గాలి మోటర్లు వేసుకొని 2025 జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు చేసిన సుడిగాలి పర్యటనలకు అయిన ఖర్చు లెక్క దాదాపు 17.22 కోట్లు!
భూ భారతి అధ్యయనం కోసం పర్యటనలు చేశానంటూ ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పిన ఖర్చు లెక్క దాదాపు 9.16 కోట్లు!
ఢిల్లీ పర్యటనల కోసం ప్రత్యేక విమానాలు వాడినప్పటికీ, కాదని ఎకానమీ క్లాసులోనే వెళ్లినట్టు చెప్పిన అబద్ధాన్ని లెక్కవేసుకున్నా సీఎంకు, ఆయన భద్రతా సిబ్బందికి 42 సార్లకు అయిన ఖర్చు లెక్క దాదాపు 45.68 కోట్లు!
ముక్కోటి దేవతల మీద ఒట్టు.. ఇవన్నీ దుబారా కానే కావు
ఉద్యోగ సంఘాల డిమాండ్లపై రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణ వచ్చినప్పుడు రూ. 500 నుంచి రూ. 600 కోట్లు ఉన్న అప్పు, నేను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ఈ 16 నెలల్లో రూ. 1.52 లక్షల కోట్లు కట్టినమంటే యావరేజ్‌గా రూ. 9 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ప్రతినెల అసలు, మిత్తి కట్టిన. కట్టుకుంటూ వచ్చినందుకు కొంత అప్పు భారం తగ్గి, కొత్త అప్పులు నేను ఎక్కువ చేయకపోవడం వల్ల ఈ రోజు రూ. 7 వేల కోట్లు ప్రతినెల నేను కట్టాల్సిందే. ఇదే కాదు, మీ ప్రభుత్వ ఉద్యోగులు 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పదవీ విరమణ కాలాన్ని పొడిగించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తదని మూడేండ్లు పెంచిండు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీకు ఇవ్వకుండా మీకు బకాయిలు పెట్టింది ఎంతయ్యా అంటే 8,500 కోట్లు. రిటైర్ ఉద్యోగస్తులకు 3 లక్షల మందికి పెన్షన్లు రెండో ఎత్తు. 9 వేల కోట్లు బకాయిలు పెట్టి పోయిండు” అని రేవంత్ పేర్కొన్నారు.
“ఈ రోజు రిటైర్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నరు, లేకపోతే మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవని కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నయో అవన్నీ మీరు మాకు వారసత్వంగా ఇచ్చి పోయిన మొండి బకాయిలు. ఇవాళ వాటిని ఒకపక్కన క్రోడీకరిస్తూ, క్రమబద్ధీకరిస్తూ ఈ రోజు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతో ఉన్నయో పెన్షన్లు ఆపలేరు, రైతుభరోసా ఆపలేరు, షాదీముబారక్ ఆపలేరు. కల్యాణలక్ష్మి ఆపలేరు. ఇట్ల చెప్పుకుంటూ వెళ్తే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏవైతో కొనసాగించిందో రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఆపలేరు” అని రేవంత్ వివరించారు.
“నన్ను కోసినా కూడా 18,500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తరయ్యా నన్ను, ఉద్యోగ సంఘాల నాయకులు నన్ను కోసుకొని తింటరా? ఉన్నదే 18,500 కోట్లు ఎట్ల పంచుదామో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటరా? ఉచిత కరెంట్ ఆపమంటరా? షాదీ ముబారక్ ఆపమంటరా? ఏది ఆపమంటరో చెప్పండి. ఏది ఆపుతరో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేం బోనస్‌లు తీసుకుంటం, జీతాలు పెంచుకుంటం, మేం తినంగ మిగిలిందే మీకు ఇస్తమని ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేస్తా, 10 లక్షల మందిని తెస్తా.. ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పండి.. మేం ముఖ్యమంత్రికి ఈ చిట్టీ ఇచ్చినం..దీని ప్రకారం పరిపాలన జరుగతలేదు. లేదంటే నూరు రూపాయలున్న పెట్రోలు 200 చేద్దామా చెప్పర్రి. 30 రూపాయలకిచ్చే బియ్యాన్ని 60 రూపాయలు చేద్దామా చెప్పుర్రి. పప్పు, ఉప్పు, చింతపండు, బెల్లం ధరలు రెండింతలు చేద్దామా చెప్పుర్రి. ఏది పెంచుదామా చెప్పుర్రి. ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుర్రి. ధరలు పెంచకుండా, ఉన్న పథకాలు ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామని, రైతులకు రూ. 500 బోనస్ ఇచ్చామని, రూ. 500కే ఈ రోజు సిలిండర్ ఇస్తున్నామని, ఫీజుయింబర్స్మెంట్ చెల్లించే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్‌రెడ్డి వివరించారు. “ఇట్ల చెప్పుకుంటూ పోతే రూ. 21 వేల కోట్లు సరిగ్గా ఆరు నెలలు తిరిగే లోపల పంద్రాగస్టు లోపల 25,55,364 మంది రైతులకు రూ. 20,617 కోట్ల రైతు రుణమాఫీ చేసి రూ. 2 లక్షల వరకు రైతు అప్పున్న అందరికీ అప్పు నుంచి విముక్తి కలిగించిన. ఆయన పెండింగ్ పెట్టిపోయిన రైతుబంధు రూ. 7,625 కోట్ల వచ్చిన మూడు నెలల్లోనే నేను చెల్లించిన. అంటే ఈ 15, 16 నెలల్లో కేవలం రైతులకే రూ. 30 వేల కోట్ల నగదు వారి ఖాతాల్లోకి బదిలీ చేసిన. ఉచిత కరెంటు ఆపలేరు. ఈ రోజు పేదలకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నా. మా ఆడబిడ్డలకు రూ. 500 కే సిలిండర్ ఇస్తున్న” అని రేవంత్ తెలిపారు.
ఆర్టీసీకి రూ. 5 వేల కోట్లు కట్టి, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి నడిపించే ప్రయత్నం చేస్తున్నానని రేవంత్ పేర్కొన్నారు. “వెళ్తూవెళ్తూ రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన అన్నాడు. విద్యుత్తు శాఖకు దాదాపు ఈ ఉచిత కరెంటు పేరుమీద వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పోయిండు. విద్యుత్తు శాఖ కోసం సింగరేణిలో బొగ్గు కొన్నడు. వారికి వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టిండు. ప్రాజెక్టులు కట్టిన అన్నడు. కాంట్రాక్టర్ల బిల్లులు రూ. 50 వేల కోట్లు బకాయిలు పెట్టిపోయిండు. ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే నాలుగైదు శాతం మిత్తికి లోన్లు దొరకుతయి. 11శాతం మిత్తీకి అప్పులు తీసుకొచ్చిండాయన. అవుటర్ రింగ్‌రోడ్డు అమ్మేసిర్రు. కష్టపడి కట్టిన 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఏడున్నర వేల కోట్లకు ఎవరికో అమ్ముకుని పోయి న్రు. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్‌లోని భూములన్నీ అమ్మేశారు” అని రేవంత్ వివరించారు.
ఉద్యోగుల డిమాండ్లపై సీఎం మాట్లాడుతూ.. “నేనొచ్చిన తర్వాత ఒక గుంటభూమి కూడా ఈ రోజు వరకు అమ్మలే. నేను చేసిన అప్పు మొత్తం పాత అప్పులు కట్టడానికే చేసిన. భవిష్యత్తులో కూడా ప్రతినెల రూ. 10 వేల కోట్లు అప్పు చేస్తే రూ. 9 వేల కోట్లు పైన పాత అప్పులకు అసలుకు, మిత్తికే కట్టాలి అన్నరు. నువ్వు ఐదారులక్షల కోట్లు అప్పు చేసేటట్టు ఉన్నవని అసెంబ్లీలో అన్నారు లక్షాయాభై రెండు వేల కోట్లు అప్పు చేశావని. నేను లేచి లెక్క సరిచేసిన. రూ. 1.52 లక్షల కోట్లు కాదు సామి రూ. 1.58 లక్షల కోట్లు అప్పు చేసిన అని చెప్పిన. రూ. 1.52 లక్షల కోట్లు నువ్వు చేసిన అప్పులకు, తప్పులకు కట్టిన అని చెప్పిన” అని రేవంత్ చెప్పుకొచ్చారు.
ప్రభుత్వమంటే నేనొక్కణ్నే కాదు. మనందరం కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు సేవకులం, మీకొక రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకింకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. పోలీసు శాఖలో హోం గార్డు నుంచి డీజీ ర్యాంకు వరకు వేర్వేరు బాధ్యతలున్నట్టుగానే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్‌గా, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్‌గా మాకింకొక బాధ్యత ఉన్నది. మనందరం కలిస్తేనే పంచాయతీరాజ్, రెవెన్యూ, ఆర్అండ్బీ పోలీసు అన్ని శాఖలు కలిస్తేనే ప్రభుత్వం. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈ రోజు సమరం అని ప్రకటిస్తున్నారు.
ఎవరిమీద మీరు సమరం చేస్తరు? ఎవరిని నిందించదలచుకున్నారు? ఎవరిని కొట్టదలచుకున్నరు? ఎవరిమీద యుద్ధం ప్రకటిస్తున్నారు. సంఘాల నాయకులను అడగదలచుకున్న. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలు మనకు జీతభత్యాలిచ్చి, రిటైరైన తరువాత మనకు పెన్షన్లు కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న 98 శాతం ప్రజల పెన్షన్లు, రైతుభరోసా, రుణమాఫీ, ఉచిత కరెంట్, షాదీముబారక్ ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు లేదా? ప్రజాప్రతినిధుల మీదనే ఉన్నదా?” అని రేవంత్ పేర్కొన్నారు.
ఉద్యోగుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన రేవంత్‌రెడ్డి.. “మనందరం కలిస్తేనే ప్రభుత్వం. దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులు, మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలకోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఏదన్నా విషయం ఉంటే చర్చించండి.. ప్రతినెల రాష్ర్టానికి వస్తున్న ఆదాయం సరిపోతలేదు. ఈ రోజు మీకిచ్చే జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో వివిధ పనులు చేయడానికి రూ.22,500 కోట్లు కావాలి. రూ.4వేల కోట్లు ఆదాయం ప్రతి నెల తక్కువుంది. మా రామకృష్ణారావుగారు, మా భట్టివిక్రమార్కగారు చేస్తున్నది ఏందయ్యా అంటే ఒక నెల ఈయనకు ఆపి ఆయనకు ఇస్తున్రు, మరొక నెల ఆయనకు ఆపి ఈయనకు ఇస్తున్రు. అడ్జస్ట్మెంట్.. బడ్జెట్ పద్మనాభం పనులు చేస్తున్నరు. ఉన్నది రూ.18,500 కోట్లే. ఇందులో 7వేల కోట్లు అప్పుకు పోయింది.
5,000 కోట్ల నుంచి 5,500 కోట్ల వరకు మీ జీతభత్యాలకు పోయింది. మొత్తం 13వేల కోట్లు పోయిన తరువాత నా చేతుల మిగులుతున్నది 6,000 కోట్లు నికరంగా. ఈ ఆరువేల కోట్లల్ల పెన్షున్లు ఇయ్యాల్నా, వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాల్నా, రైతు రుణమాఫీ చేయాల్నా? రైతు భరోసా ఇవ్వాల్నా? షాదీ ముబారక్ ఇవ్వాల్నా? కల్యాణలక్ష్మి ఇవ్వాల్నా? ఫీజు రీయింబర్స్మెంట్ కట్టాల్నా? ఏమేం పథకాలు చేయాలె? ఈ అన్ని పథకాలు చేయాలంటే నాకు 22వేల కోట్ల చిల్లర కావాలె. ఈ 18వేల నుంచి 18,500 కోట్లల్లనే ప్రతిరోజు కూర్చొని.. మీకు నెల జీతమొస్తే.. ఇంటి ఖర్చెంత? పాల ఖర్చుంత? హాస్పిటల్ ఖర్చెంత? పిల్లల ఫీజులెంత? మీరెట్ల ప్రణాళికలు చేసుకుంటున్నరో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడాఅట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి రూపాయి ఎక్కడా ఖర్చు పెంచకుండా, దుబారా మొత్తం తగ్గించిన” అని వివరించారు.
“ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు. కానీ మామూలు విమానంలో ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్న. విదేశాలకు పోతే కూడా సామాన్య ప్రయాణికులతోనే ప్రయాణం చేస్తున్నా. ఇదంతా ఎవరికీ చెప్పలేదు, చెప్పుకుంటే గొప్పలాగుంటది. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతమియ్యకపోతే ఆ కుటుంబాలు ఎట్ల నడుస్తయని.. ఏది ఏమైనా అటు సూర్యుడు ఇటు పొడిసినా..ఒకటో తారీఖు నాడు ఉద్యోగులకు జీతాలియ్యాలని రామకృష్ణారావుకు చెప్పిన. ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్తున్నా.. మనందరం కలిస్తేనే ప్రభుత్వం. మనందరం కలిసి 98 శాతం ప్రజలకు మంచి చేయడం కోసం ఇక్కడున్నం.
ప్రజల మీద యుద్ధం చేసినోళ్లు ఎవరూ బాగుపడలేదు. ప్రజలు ఊరుకుంటారా వారి మీద యుద్ధం చేస్తే? మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుతది. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారకండి అని ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ నాయకులకు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఉంటది. ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలె, ఈ ప్రభుత్వం సాఫీ నడువొద్దని కొన్ని రాజకీయ పార్టీలకు, నాయకులకు ఉంటది. మీరు వారి ఉచ్చులోపడి వారి చేతిలో పావులుగా మారి, వారి చేతుల్లో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో గుచ్చాలని ప్రయత్నం చేస్తే.. అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు” అని రేవంత్ పేర్కొన్నారు.
“కొత్త కొత్త కోరికలు కోరుకొని మనం నిరసననో, ధర్నాలో, దీక్షలో, బందో చేస్తే.. ఉన్న వ్యవస్థ కూడా కుప్ప కూల్తది. ఉన్నది కుప్పకూల్చుకుంటే మళ్లీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇక ఏమీ లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతము. ఇయ్యాల్ల మీరు సమరాలు చేస్తే, శాంతిభద్రతలు దెబ్బతింటే, పెట్టుబడులు ఆగిపోతయి. పెట్టుబడులు ఆగిపోతే.. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరకవు అని చెప్పారు.
బాధ్యతగా వ్యహరించాల్సిన మనం బాధ్యత మరిచి వ్యవహరిస్తామంటే తెలంగాణ సమాజానికి తీరని నష్టం జరుగుతుందని రేవంత్ పేర్కొన్నారు. “రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు. అప్పు పుడుతలేదు. అణా పైసా కూడా ఎవ్వడూ ఇస్తలేడు. ఎవ్వడినైనా కలవడానికిపోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్రు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఢిల్లీకిపోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతడేమో అన్నట్టుగా. ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి, తెచ్చి ఇచ్చేటోణ్ని. అప్పు పుట్టట్లేదు. ఎవ్వడూ బజార్ల నమ్మడంలేదు” అని పేర్కొన్నారు.
లెక్కలు కావాలంటే ఆర్థిక మంత్రికి చెప్తానని, లేదంటే చీఫ్ సెక్రటరీకి చెప్తానని, అణాపైసలు సహా మీరే లెక్కగట్టాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. “నేను చెప్తున్నదానికంటే ఒక్క రూపాయి ఆదాయం ఎక్కువ ఉన్నా మీకే పంచిపెడ్తా. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇయ్యాల్నంటే ఇంకొక ఏడువేల కోట్లు కావాలి. నేను చెప్పేవన్నీ నిత్యావసర, అత్యవసరానికే రూ.22 వేల కోట్లు. దాంట్లోనే నాలుగు వేల కోట్లు తుట్టుంది. ఇక ఆయన పెట్టిపోయిన రూ.50 వేల కోట్లు కాంట్రాక్టర్ల పాత బకాయిలు ఇయ్యాల్నంటే నెలకు రూ.7వేల కోట్లు కావాలి. సాగునీటి ప్రాజెక్టులల్ల 70 శాతం, 80 శాతం, 90 శాతం పూర్తయినయి ఉన్నయి. నెలకొక రూ.1,000 కోట్లు మనం సాగునీటి మీద ఖర్చుపెడితే రెండేండ్లల్ల దాదాపుగా 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇయ్యొచ్చు. కాంట్రాక్టర్లు, పనులకు బిల్లులు చెల్లించాలంటే రూ.1,000 కోట్లు కూడా దొరకడంలేదు. రూ.1,000 కోట్లు కూడా రావడం లేదు” అని రేవంత్ పేర్కొన్నారు.
తనను కోసినా రూపాయి కంటే ఎక్కువ రాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. మొత్తం దివాలా తీసిందని, మూడు నాలుగు శాతానికి రావాల్సిన దానిని 11 శాతానికి మిత్తికి ఎవరన్నా తెస్తారా? అని ప్రశ్నించారు. “పది రూపాయల మిత్తికి డైలీ ఫైనాన్స్‌కి తెచ్చుకునేటోడు ఉంటడు చూడు బజార్లలో. అంతకంటే ఎక్కువ అధ్వానంగా అప్పులు తెచ్చి పెట్టిండు. హ్యాపీగా పోయి ఫామ్‌హౌస్‌లో పండిండు. చావండ్రా మీ చావు మీరు చావండ్రా అని. అది ఫెయిల్, ఇది ఫెయిల్ అంట. ఆయనకేముంది ఆనందంగా ఉంది చెప్పడానికి. చెప్పేటప్పుడు ఫేస్‌లో ఎంత ఆనందం కనిపిస్తదంటే.
రైతుబంధు ఫెయిల్ అనంగనే ఫేస్‌లో వెయ్యి వోల్టుల బల్బు వెలిగినట్టుంది. ఎవ్వడన్న బాధపడతడయ్యా అరె తప్పు జరిగిందని, ఎవరికైనా రాలేదంటే బాధతోని చెప్తం మనం. ఫీజు రీయింబర్స్మెంట్ ఇయ్యలేదంటే అయ్యో పాపం పిల్లల చదువు ఎట్ల అని ఒక బాధ ఉంటది. జీతభత్యాలు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇయ్యలేదంటే ఒక కన్సర్న్ ఉంటది. అరె ఏందయ్యా ఇట్ల అయిపోయింది అని. వారి ఫేస్ చూడండి. ఫెయిల్ చెప్పేటప్పుడు, ప్రతి ఫెయిల్ వెనకాల ఒక వెయ్యి వోల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేస్. ఏం పైశాచిక ఆనందం” అని రేవంత్ చెప్పుకొచ్చారు.
తనతోతో చదువుకున్నవాళ్లు చాలామంది ఎస్సైలు అయ్యారని, కానిస్టేబుళ్లు కూడా అయ్యారని రేవంత్ పేర్కొన్నారు. “దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. సమరం కాదిప్పుడు కావాల్సింది. సమయస్ఫూర్తి కావాలి. రాష్ర్టాన్ని ముందుకు నడిపించాలంటే. చిత్తశుద్ధి కావాలె, పట్టుదల కావాలె, కష్టం కావాలె, మన రక్తాన్ని చెమటగా మార్చి మనల్ని నమ్ముకున్న 98శాతం మంది ప్రజలకు సేవలందించాలి. 35 ఏండ్లు సర్వీసులో, ఆ తర్వాత రిటైర్ అయినా మనం బతకడానికి ప్రజలు కట్టిన పన్నులలో నుంచి ప్రభుత్వం పని చేస్తుంది.
ప్రజాప్రతినిధిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను జీవితకాలం ఊడిగం చేసినా తక్కువే అవుతుంది. మీరూ మేము కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు. మనం సేవకులం. ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నాం. సంఘాల నాయకుల్లారా, కార్మిక సంఘాల నాయకుల్లారా.. అది ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, విద్యుత్తు కార్మికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, మీకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. సవినయంగా మనవి చేస్తున్నా. మన బాధ్యతలు మనం నిర్వహించుకుందాం” అని పేర్కొన్నారు.
మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. మరి నువ్వెట్ల ఇన్ని హామీలు ఇచ్చినవని ఒకాయన తనను అడిగాడని, 3 లక్షల అప్పు ఉంది, ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల ఆదాయం ఉందని బడ్జెట్ పెట్టినం అని చెప్పానని రేవంత్ పేర్కొన్నారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, 3 లక్షల కోట్ల ఆదాయం ఉంది కాబట్టి ఇదెంత సంసారం, సక్కదిద్దొచ్చని అనుకున్నానని రేవంత్ చెప్పారు. “తీరా చూస్తే 3 లక్షల కోట్ల ఆదాయం లేదు. ఆదాయం 2 లక్షల కోట్లు ఉంది. అప్పు ఏమో 8 లక్షల కోట్లు ఉంది. ఇగ చెప్పుర్రి మీరే. మీరందరూ కూడా సదువుకున్నోళ్లే. ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యిండ్రంటే, మీరు కూడా లైఫ్ టైమ్ కష్టపడి మీరు ఎన్నో ఎగ్జామ్‌లు రాసి ఇక్కడికి వచ్చిర్రు. పోలీసు, ఎస్సై కావాల్నంటే కూడా ఎంత సదవాల్నో నాకు తెలుసు అని రేవంత పేర్కొన్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కోతుల గుంపునకు అప్పగించుకున్నట్టు చేసుకోవద్దని సీఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు. “మనం సాధించుకున్న తెలంగాణను మనం అభివృద్ధిపథం వైపు నడిపించుకుందాం. ప్రపంచానికే ఆదర్శంగా, నంబర్‌వన్‌గా నిలబడేటట్టు చేద్దాం. రోజుకు 18 గంటలు కష్టపడుతున్న. 2023 డిసెంబర్ 7న బాధ్యత తీసుకున్నప్పట్నుంచి ఏరోజైనా, ఒక్క గంటైనా నేను సెలవు తీసుకున్ననా.. మీరు ఆలోచన చేయండి. నాకు జీవితంలో ఏ లక్ష్యమూ లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాల్సిన తెలంగాణ మోడల్‌ను, తెలంగాణ రైజింగ్ అని తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే నా పట్టుదల. వయసు ఉంది.. ఓపికా ఉంది.. మీతో కలిసి కష్టపడేతత్వం నాకున్నది. నాతో కలిసిరండి. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిపథం వైపు నడిపిద్దాం. పోలీసులకు కూడా నా విజ్ఞప్తి. మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత నాది. శాంతిభద్రతలను కాపాడండి. డ్రగ్స్ మీద ఉక్కుపాదంపెట్టి తొక్కండి. సైబర్‌క్రైమ్‌ను నియంత్రించండి. అందరం కలిసి రాష్ర్టాన్ని, దేశాన్ని గొప్పగా, తలమానికంగా తీర్చిదిద్దుదామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా అని రేవంత్‌రెడ్డి ముగించారు.
ఆరేడు వందల కోట్ల రూపాయలిచ్చి రోడ్లు వేయిస్తున్నానని, పదేండ్ల నుంచి వేయని రోడ్లు ఇయ్యాల గుంతలు పడ్డాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. “మీరు కష్టపడి కారు కొనుక్కుంటరు. సైకిల్ మోటర్ కొనుక్కుంటరు. ఫ్యామిలీతోని వస్తే సడన్‌గా గుంతలపడి కాలో, చెయ్యో ఇరిగిపోతది. ఇయ్యాల చిన్నచిన్న గ్రామాలకు రోడ్లు వేయ్యాలంటే అణాపైసా లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయిలేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిని ఉన్నం. ఒక కుటుంబం విచ్ఛిన్నం అయిపోయి, ఛిన్నాభిన్నం అయిపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్ల ఉంటదో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అట్లనే ఉంది” అన్నారు.
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరిన పాపానికి సీఎం రేవంత్ తమను ప్రజల దృష్టిలో విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వోద్యోగులు మండిపడుతున్నారు. సీఎం తమను అవమానించేలా వ్యాఖ్యానించారని, ‘రెండు శాతం ఉన్నోళ్లు’అనడం తమను అవమానించడమేనని అంటున్నారు. గత ఎన్నికల్లో ఈ రెండు శాతం ఓట్లతోనే కాంగ్రెస్ గెలిచిన విషయాన్ని మర్చిపోవద్దని గుర్తుచేస్తున్నారు.
ప్రజా సంక్షేమ పథకాలు ఆపేయడం లేదా ధరలు పెంచడం ఈ రెండింట్లో ఏదో ఒకటి చేస్తేనే ఉద్యోగుల కోర్కెలు తీర్చగలమంటూ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. ప్రజలకు, ప్రభుత్వోద్యోగులకు మధ్య అగాధం సృష్టించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఒక రకంగా ప్రజలను ఉద్యోగులపై ఉసిగొల్పేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. తాము అదే ప్రజల మధ్యకు వెళ్లి ఉద్యోగాలు ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. రిటైరైనవారికి అగ్రతాంబూలం ఇచ్చి లక్షలకు లక్షలు వేతనాలు ఇవ్వడం వృథా కాదా అని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం కాదు మిస్టర్ చీప్ మినిస్టర్’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రభుత్వోద్యోగుల డిమాండ్ల విషయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. దివాలా తీసింది తెలంగాణ కాదని, ముఖ్యమంత్రి, ఆయన అవినీతి కాంగ్రెస్ పార్టీ మేధోపరంగా దివాలా తీశాయని, నైతికంగా చితికిపోయాయని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మీడియాతో మాట్లాడుతానని కేటీఆర్ ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న బోగస్ ప్రచారాన్ని ఆపాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. పరిపాలన చేతకాక, ప్రజల దృష్టి మరల్చేందుకు, ఇతరులపై బురదజల్లే కుయుక్తులకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్నదని విమర్శించారు. వారి అబద్ధపు ప్రచారాన్ని బట్టబయలు చేస్తామని, చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎన్నికల ముందు నమ్మబలికిన రేవంత్‌రెడ్డి.. గద్దెనెక్కిన తర్వాత డీఏలు మంజూరు చేయక, పీఆర్సీ ఇవ్వకుండా వారిని నట్టేట ముంచారని బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగులు, ప్రజల మధ్య చిచ్చుపెట్టి పథకాల అమలు నుంచి త ప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు డీఏలకు, పథకాల అమలుకు ఖజానాలో డబ్బుల్లేవని చెప్తున్న సీఎం.. అందాల పోటీలకు, మూసీ ప్రక్షాళన, ఫోర్త్‌సిటీకి మాత్రం వేలకోట్లు ఖర్చు చేస్తానని చెప్పడం సిగ్గుచేటన్నారు.
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిషారంపై రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రైతులు, ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎదురొంటున్న సమస్యలను పరిషరించడంలో సీఎం ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. పాలన చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి రాష్ర్టాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): న్యాయమైన డిమాండ్ల సాధనకు నిరసన తెలుపుతామని ప్రకటించిన ఉద్యోగులను సీఎం బెదిరించడం బాధాకరమని బీఆర్ఎస్ నేత, ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు దేవీప్రసాద్ పేర్కొన్నారు. వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చర్చలకు పిలువకుండా చేతులెత్తేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ప్రజల నుంచి ఉద్యోగులను వేరుచేసే కుట్ర జరుగుతున్నదని అనుమానం వ్యక్తంచేశారు. డీఏలు ఇవ్వని ముఖ్యమంత్రి మరి అందాల పోటీలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి పాలన చేతగాక ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ విమర్శించారు. ఉద్యోగులు కోరుతున్నది హక్కులు మాత్రమేనని బోనస్ కాదని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధానకార్యదర్శులు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి స్పష్టంచేశారు. ఉద్యోగులనుద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆక్షేపనీయమని టీపీటీఎఫ్ అభిప్రాయపడింది. ఉద్యోగులు అభివృద్ధికి, సంక్షేమానికి వ్యతిరేకంకాదని టీపీటీఎఫ్ అధ్యక్షప్రధానకార్యదర్శులు అనిల్, తిరుపతి పేర్కొన్నారు.