హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా నందిగామలో ఓ ఫార్మా కంపెనీలో రెండురోజుల క్రితం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ప్రాణాలకు తెగించి ఆరుగురిని రక్షించిన సాహస బాలుడు సాయిచరణ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. పోలీసులు, ఫైర్ ఉన్నతాధికారుల ద్వారా సాయిచరణ్ సాహసాన్ని తెలుకొన్న ముఖ్యమంత్రి ఆదివారం తన కార్యాలయానికి అతన్ని కుటుంబంతో సహా పిలిపించుకొన్నారు.
సాయిచరణ్ తాడుసాయంతో ఆరుగురి కాపాడిన విధానాన్ని తెలుసుకొని రేవంత్‌రెడ్డి ముగ్ధుడయ్యారు. అనంతరం సాయిచరణ్‌ను ఘనంగా సన్మానించారు. అతడి చదువు, తల్లిదండ్రుల కుటుంబనేపథ్యం తెలుసుకొన్నారు. గత శుక్రవారం ఓ ఫార్మాకంపెనీలో సంభవించిన అగ్నిప్రమాదంలో సుమారు 50 మంది కార్మికులు మంటల్లో చిక్కుకొన్నారు. వీరిలో చాలామంది కిటికీల్లోంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకొన్నారు.
కొందరు బయటికి రాలేక మంటల్లోనే చికుకుపోగా, సాయిచరణ్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, తన ప్రాణాలకు తెగించి ఆరుగురిని కాపాడాడు. తెలివిగా ఫార్మా కంపెనీ భవనంపైకి ఎకి తాడు కట్టి, కిటికీలు పగలగొట్టడంతో బయటికి వచ్చిన బాధితులు.. ఆ తాడును పట్టుకొని సురక్షితంగా బయటికి రాగలిగారు. సాయిచరణ్ సాహసం గురించి తెలుసుకొన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, పలువురు రాజకీయ నాయకులు ఎంతగానో అభినందించారు.