FDC | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అందించబోయే కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇతర కుటుంబసభ్యుల పేర్లు, వారి వివరాలు.. కార్డు వెనుక ఉంచాలని పేర్కొన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై (ఎఫ్డీసీ) శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
25 నుంచి 27వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రల్లో పర్యటించిన అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మా ట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న రేషన్, రాజీవ్‌ఆరోగ్యశ్రీ, వ్యవసాయ, ఐటీ, ఇతర సంక్షే మ పథకాల్లోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని సూచించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం అవసరంలేదన్నారు.
ఎఫ్డీసీ సమాచారణ సేకరణ, ఏయే అం శాలు పొందుపరుచాలి వంటి వివరాలతో కూడిన నివేదికను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనరసింహతో కూడిన మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని సూచించారు.
కుటుంబాల నిర్ధారణ, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వివరాలకు అందుబాటులో ఉన్న డాటా ఆధారంగా అక్టోబర్ 3 నుంచి ఇంటింటికీ తిరిగి పరిశీలించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి అధికారిని, పట్టణ ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించాలని చెప్పారు. ఉమ్మడి జిల్లాకు ఇటీవల వరదల సమయంలో వేసిన సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని ఆదేశించారు.