CM Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఆయన మంగళవారం రాత్రి లేదా బుధవారం తిరిగి వస్తారని సమాచారం. వాస్తవానికి ఆయన షెడ్యూల్లో ఢిల్లీ పర్యటన లేదని, తాజా పరిణామాల నేపథ్యంలో హడావుడిగా బయల్దేరినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆదివారం అస్వస్థతకు గురైన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికాఖార్జున ఖర్గేను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
కానీ, హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నదని, వారికి వివరణ ఇచ్చేందుకే సీఎం ఢిల్లీ వెళ్లారన్న చర్చ జరుగుతున్నది. దీంతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఈడీ దాడుల గురించి కూడా అధిష్ఠానం పెద్దలకు వివరించే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. దసరాలోపు మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా అధిష్ఠానంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్టు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత హస్తినకు వెళ్లడం ఇది 23వ సారి.